ఒకే మండలామా?: ప్రభుత్వ ప్రకటనపై మెదక్ ప్రజల అసంతృప్తి!

క‌లం, మెద‌క్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేసిన క‌రువు మండ‌లాల ప్రక‌టన మెద‌క్ జిల్లా (Medak Drought) ప్రజ‌ల‌ను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. రాష్ట్రంలోనే అత్యల్పంగా మెద‌క్ జిల్లాలో కేవ‌లం ఒకే ఒక మండ‌లాన్ని లిస్ట్‌లో చేర్చి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు మంజూరయ్యే అవకాశం లేదని జిల్లా ప్రజలు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో 31 జిల్లాల పరిధిలో ఖరీఫ్‌ సీజన్‌లో 365 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే మెద‌క్ జిల్లాలో మొత్తం 21 మండలాలకు, గజ్వేల్ సెగ్మెంట్ పరిధిలోని మ‌నోహ‌రాబాద్ మండలాన్ని మాత్రమే క‌రువు మండలంగా ప్రభుత్వం ప్రక‌టించింది. మ‌రోవైపు ఉమ్మడి మెద‌క్ జిల్లాలో భాగ‌మైన సంగారెడ్డి జిల్లాలో వంద‌కు వంద శాతం 28 మండ‌లాలను, సిద్దిపేటలో జిల్లాలో మొత్తం 26కు 8 మండలాలను క‌రువు ప్రాంతాలుగా ప్రకటించింది. మాజీ సీఎం కేసీఆర్ ప్రతినిథ్యం వహించే గజ్వేల్ పరిధిలోని ఆయన ఫామ్ హౌస్ ఉన్న మ‌ర్కుక్ మండలం సహా నాలుగింటిని లిస్ట్‌లో చేర్చింది. వ‌ర్షపాతం, సాగు విస్తీర్ణం ప్రతిపాదిక‌న క‌రువు మండ‌లాల‌ను ప్రక‌టించామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు మెద‌క్ జిల్లాలో క్షేత్రస్థాయిలో ప‌రిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

న‌ష్టపోతామంటున్న ప్రజ‌లు

మెదక్ జిల్లాలోని పలు మండలాలను క‌రువు కింద గుర్తించకపోవడంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక నిధులు, గ్రాంట్లు రావ‌ని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎల్ నినో తో భవిష్యత్ రోజుల్లో తాగునీటితో స‌హ ప‌లు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడతామంటున్నారు. అదే సరిహద్దున సంగారెడ్డి జిల్లాలోని అన్ని 28 మండ‌లాల‌ను క‌రువు కింద ప్రక‌టించిన ప్రభుత్వం, మెద‌క్ జిల్లాపై చిన్న చూపు చూసింద‌ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరువు మండలాలుగా ప్రకటిస్తే..

కరువు మండలాలుగా ప్రకటిస్తే రైతులకు ఉపయోగకరంగా ఉండేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంట దెబ్బతిన్న రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ లేదా ఉచిత విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తుంది.
బ్యాంకుల నుంచి రైతులు తీసుకునే పంట రుణాలను రీషెడ్యూల్ చేస్తారు. వడ్డీపై రాయితీ లేదా మినహాయింపు ఇస్తారు. బ్యాంకు రుణాలు, విద్యుత్ బిల్లులు లేదా ఇతర ప్రభుత్వ బకాయిల వసూళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న చోట బోర్లు వేయ‌డంతో పాటు, ట్యాంకర్ల ద్వారా ఉచితంగా తాగునీటి సరఫరా, పశువుల కోసం పశుగ్రాస శిబిరాలు, దాణా పంపిణీ ఏర్పాటు చేస్తారు.

అంతేకాకుండా కరువు మండలాలకు సాధారణ బడ్జెట్ నిధులతో పాటు ప్రత్యేక అత్యవసర నిధులు విడుదలవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వద్ద ఉన్నరాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధుల నుంచి వెంటనే కరువు నివారణ చర్యల్లో భాగంగా మండలాల వారీగా బడ్జెట్ విడుదల చేస్తుంది. ఉపాధి కూలీలకు పనులు కల్పించడానికి అదనపు పని దినాల కేటాయింపు ఆధారంగా నిధులు మంజూరవుతాయి. తాగునీటి బోర్ల మరమ్మతులు, పైప్‌లైన్ల విస్తరణ, మంచినీటి రవాణా కోసం ప్రత్యేక గ్రాంట్లు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించిన తర్వాతే కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కూడా ప‌లు ర‌కాల నిధులు, ప్ర‌త్యేక గ్రాంట్ల‌ను మంజూరు చేస్తుంది.

కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర‌

తన నియోజ‌క‌వ‌ర్గమంతా వ్యవ‌సాయ ప్రాంత‌మ‌ని, మొత్తం 8 మండ‌లాల్లో ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా ల‌క్ష్మారెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే తాగు, సాగునీరు, క‌రెంటు కోసం రైతులు, ప్రజ‌లు రోడ్లెక్కి నిర‌స‌నలు, ఆందోళనలు చేస్తున్నారన్నారు. ప్రజ‌ల ఇబ్బందులు, క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులను ప‌ట్టించుకోకుండా నివేదిక‌ల పేరిట ఏ ఒక్క‌టి క‌రువు మండలంగా ప్రక‌టించ‌క‌పోవడం కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర అని ఆమె ఆరోపించారు. భవిష్యత్ లో ప్రజ‌లు, రైతులు ఎదుర్కొనే ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కార‌ణ‌మవుతుందని పేర్కొన్నారు.

క‌రువు మండ‌లాల‌ను ప్రక‌టించ‌కుండా ప్రజ‌ల‌ను మోసగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందని, మరోవైపు క‌రువు మండలాలుగా గుర్తించకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేకంగా వ‌చ్చే క‌రువు నిధులు రాకపోతే ప్రజ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పున‌రాలోచించి న‌ర్సాపూర్ పరిధిలోని మండ‌లాలను కరువుగా ప్రక‌టించి ఆదుకోవాలని ఆమె రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>