కలం, తెలంగాణ బ్యూరో: ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితుల్లో విద్యుత్, నీటి సమస్యలు ఉన్నందున డేటా సెంటర్లకు (Data Centers) నిరంతరంగా సరఫరా చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఫ్యూచర్ సిటీలో చందన్వెల్లి, రావిర్యాల, మీర్ఖాన్పేట్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా ‘డేటా సిటీ’ని 2 వేల ఎకరాల్లో నెలకొల్పేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. టీజీఐఐసీ దీనికి అవసరమైన ల్యాండ్ బ్యాంక్‌పై ఫోకస్ పెట్టింది. ఇప్పుడు ఎల్ నినో నుంచి బయటపడినా భవిష్యత్తులో దాదాపు 10 వేల మెగావాట్ల మేర విద్యుత్ డిమాండ్, ప్రతీ రోజు కొన్ని లక్షల లీటర్ల నీటి సరఫరా చేయడం చాలెంజింగ్ టాస్క్ కానున్నది.
డేటా సెంటర్ల (Hyderabad Data Centers) ఏర్పాటుకు భూకంపాలు, తుఫానులు, సునామీలు లేకుండా హైదరాబాద్ ‘బెస్ట్ డెస్టినేషన్’గా భావిస్తున్న కంపెనీలు పెట్టుబడులకు వెనకాడడంలేదు. ఇప్పటికే అమెజాన్, కంట్రోల్ ఎస్, సిఫీ టెక్నాలజీస్, ఐరన్ మౌంటెయిన్, ఎన్ ఎక్స్ ట్రా తదితర కంపెనీలు ప్రాథమికంగా పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో విస్తరణ కోసం నిర్ధిష్టమైన ప్రణాళికలే ఉన్నాయి. డేటా సెంటర్లకు ఇక్కడితో ఫుల్స్టాప్ పడుతుందా? ఇంకా కొత్తవి వస్తాయా? అనేది కీలకం.
గ్లోబల్ సమ్మిట్‌లో ఎంవోయూలపై ఉత్కంఠ
డేటా సెంటర్లకు భారీ విద్యుత్, నీటి సప్లై అవసరాలను దృష్టిలో పెట్టుకుని డిసెంబర్లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో కొత్త సెంటర్ల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలను ప్రభుత్వం పరిమితం చేసుకుంటుందా? కుదుర్చుకుంటుందా? అనేది కీలకంగా మారింది. ప్రజల అవసరాలకు కోత పెట్టి డేటా సెంటర్లకు, మద్యం తయారు చేసే బేవరేజెస్ కంపెనీలకు నీటిని ఇవ్వడాన్ని విపక్షాలే కాక పౌర సంఘాలు సైతం తప్పుపడుతున్నాయి. దేశంలోనే రెండో అతి పెద్ద డేటా సెంటర్ సిటీగా హైదరాబాద్‌కు ఇప్పటికే గుర్తింపు వచ్చింది.
ఒకవైపు పరిమిత సహజ వనరులు, మరోవైపు ప్రజల అవసరాలకు కోత పెట్టడం లాంటి అంశాల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆసక్తికరంగా మారింది. తాజాగా మానవ హక్కుల వేదిక సైతం ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తిలో ఎల్ నినో కరువు పరిస్థితుల దృష్ట్యా డేటా సెంటర్లకు తాత్కాలికంగా నీటి సరఫరాను నిలిపేయాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగానూ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కీలకమవుతున్నది.
పెట్టుబడులు వర్సెస్ ప్రకృతి వనరులు
డేటా సెంటర్ల నీటి దాహాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు శుద్ధి చేసిన ‘ట్రీటెడ్ వాటర్’ను మాత్రమే సరఫరా చేయాలని సంబంధిత అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని భారీ పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీలు సొంతంగా ప్రైవేటుగా ఎస్టీపీలు నెలకొల్పుకోవాలని జలమండలి ఇప్పటికే స్పష్టం చేసింది. విద్యుత్ డిమాండ్ కూడా ఒక ప్రధాన అంశంగా ఉండడంతో వీలైనంత వరకు సొంతంగా సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడంపైనా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో వివిధ సందర్భాల్లో సూచనలు చేశారు.
రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు వస్తున్నా సహజ వనరులను కూడా అదే స్థాయిలో కేటాయించాల్సి వస్తున్నందున ప్రభుత్వం ఆలోచనలో పడినట్లు సచివాలయ వర్గాల సమాచారం. పర్యావరణ రీత్యానూ కొత్త సవాళ్లు వస్తున్నాయన్నది మరో వాదన. ఇప్పుడున్న 860 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఇకపైన ఫ్యూచర్ సిటీలో డేటా సిటీ ఏర్పాటుతో 4,680 మెగావాట్లు దాటుతుందని అంచనా. మొత్తం 11 గిగావాట్ల డేటా సెంటర్లు వస్తాయన్నది ప్రభుత్వ అంచనా. ప్రకృతి సవాళ్ల నేపథ్యంలో దీన్ని మళ్లీ సమీక్షించాలని భావించడం గమనార్హం.
హైదరాబాద్‌పై దేశ, విదేశీ డేటా సెంటర్ల చూపు
అమెజాన్, కంట్రోల్ ఎస్, ఎస్టీటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, మైక్రోసాఫ్ట్, ‘క్యాపిటల్ ల్యాండ్’ లాంటి విదేశీ కంపెనీలతో పాటు అదానీ కనెక్స్, సిఫీ టెక్నాలజీస్, ఎయిర్ ట్రంక్, ఎన్ ఎక్స్ ట్రా (ఎయిర్టెల్), ఎస్టీ టెలీ మీడియా లాంటి కంపెనీలు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయి. ప్రకృతి విపత్తులకు ఆస్కారం తక్కువగా ఉండడమే ఇందుకు కారణం. ఇప్పటికే డేటా సెంటర్ల ఏర్పాటులో దేశంలోనే సెకండ్ ప్లేస్‌లో ఉన్న హైదరాబాద్ రానున్న రోజుల్లో మరింత బెస్ట్ డెస్టినేషన్‌గా మారనున్నది.
ఈ డేటా సెంటర్లకు (Data Centers) రాష్ట్ర ప్రభుత్వం 220 కేవీ, 400 కేవీ, 765 కేవీ విద్యుత్ లైన్లతో పాటు ఒక్క క్లస్టర్కే రోజుకు 230 మిలియన్ లీడర్ల ట్రీటెడ్ గ్రే వాటర్‌ను సరఫరా చేసేలా రోడ్ మ్యాప్ రూపొందించింది. వీటికి తోడు ఫైబర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీలపైనా దృష్టి పెట్టింది. ఇవి 24 గంటలూ పనిచేయాల్సి ఉన్నందున నిరంతరం కరెంట్ ను, నీటిని సరఫరా చేయడం కీలకంగా మారింది. డేటా సెంటర్ల ఏర్పాటుకు ఎంవోయూలు కుదుర్చుకోవడం ఇక్కడితోనే ఆపేస్తుందా? లేక కొనసాగిస్తుందా? అనేది ప్రధానమైన అంశంగా మారింది.
ఫంక్షనింగ్, ప్రతిపాదనల్లోని డేటా సెంటర్లు
అమెజాన్ – 1000 మెగావాట్లు – 300 ఎకరాల విస్తీర్ణం – రూ. 63 వేల కోట్ల పెట్టుబడి
కంట్రోల్ ఎస్ – 2,600 మెగావాట్లు – 76 ఎకరాల విస్తీర్ణం – రూ.16,600 కోట్లు
మైక్రోసాఫ్ట్ – 200 మెగావాట్లు – 116 ఎకరాల విస్తీర్ణం – రూ.15,000 కోట్లు
ఇవి కాక ఎన్ ఎక్స్ ట్రా, అదానీ కనెక్స్, ఎస్టీటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, ఎస్బీఐ డేటా సెంటర్, ఎస్టీ టెలీ మీడియా, క్యాపిటల్ ల్యాండ్, సిఫీ టెక్నాలజీస్, ఎయిర్ ట్రంక్… ఇలాంటివన్నీ ప్రాథమిక యూనిట్లతో పాటు భవిష్యత్తులో విస్తరించే ప్రణాళికలతో ఉన్నాయి.
Also Read : ‘ఛలో ఢిల్లీ’ ఎఫెక్ట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తప్పని తిప్పలు!
Follow Us On : WhatsApp

