కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వానాకాలం వరి కోతలు ఊపందుకున్నాయి. ఎల్నినో ఎఫెక్ట్.. వర్షాభావ పరిస్థితులతో వరి సాగు అరకొరగానే సాగింది. అయితే ఉన్న కొద్ది పంటనైనా అమ్ముకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ధాన్యం కొనుగోలు (Paddy Procurement) కేంద్రాలు.. ఇంకా ఓపెనింగ్ దశలోనే ఉంటున్నాయి. పంట చేతికొచ్చిన రైతులు ఓ వైపు అర్నబ్ తుఫాన్ (Arnab Cyclone) ఎఫెక్ట్ తో చినుకులు పడితే.. నష్టపోతామనే ఆందోళ న చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ నుంచి దళారులు ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లోకి వెళ్తున్నారు. పొలాల వద్దే రైతులతో ధాన్యం ధర మాట్లాడుకుని కొనుగోలు చేస్తున్నారు. వారం పదిరోజులుగా ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
కొనుగోలు కేంద్రాల ఏర్పాటు దాకా..
ధాన్యానికి ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,461 మద్దతు ధర నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు సరిగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. మరోవైపు రైతులు ఎదురుచూడకుండా దళారులు నిర్ణయించిన ధరకు అమ్ముకుంటున్నారు. రెండు వారాల్లోపే డబ్బులు చెల్లిస్తామని హామీ ఇస్తుండడంతో అన్నదాతలు కూడా వారివైపు మొగ్గు చూపుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఏపీలోని గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి ఎక్కువగా దళారులు వచ్చి ధాన్యం కొనుగోలు (Paddy Procurement) చేస్తున్నారు.
గ్రామాలకు వెళ్లి వేబ్రిడ్జి కాంటాలతో మాట్లాడుకుని రైతుల నుంచి ధాన్యం తీసుకుంటున్నారు. అయితే వేబ్రిడ్జిల నిర్వాహకులు డబ్బులకు ఆశపడి తూకంలో భారీగా అవకతవకలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దళారులు పంటను తీసుకెళ్తుండగా.. మళ్లీ వచ్చి రైతులకు డబ్బులు చెల్లిస్తారా..? అటు నుంచి అటే ఉడాయిస్తారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ పత్తి కొనుగోలులో ఇదే తరహాలో కొందరు దళారులు రైతులకు డబ్బులు చెల్లించని ఘటనలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చాలానే ఉన్నాయి.
పట్టించుకోని అధికారులు
ఏపీకి చెందిన దళారులు వచ్చి ఉమ్మడి జిల్లాలో రైతుల నుంచి భారీగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. మిర్యాలగూడ, నాగార్జునసాగర్, కోదాడ మీదుగా ధాన్యాన్ని లారీలు, ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. అయితే చెక్ పోస్టుల వద్ద ఎలాంటి తనిఖీలు చేయడంలేదు. అదే గత సీజన్లో ఏపీ నుంచి ధాన్యం లోడ్లను తెలంగాణలోకి అనుమతించలేదు. రైతులు స్వయంగా తెచ్చినా కూడా రానివ్వలేదు. కానీ, ఈసారి దళారులు భారీగా ధాన్యం లోడ్లను ఏపీకి తరలిస్తుంటే మార్కెటింగ్, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు పట్టించుకోవడం లేదు.
పోటీ పెరగడంతో ధర తగ్గించి..
ఈ వానాకాలం సీజన్లో మిల్లర్లు సన్నవడ్లకు క్వింటాలు రూ.4వేలకు పైగా, దొడ్డు వడ్లకు రూ.3వేలకు పైనే చెల్లించారు. ప్రభుత్వం క్వింటాలుకు రూ.2,461 చెల్లిస్తామనగా.. దళారుల్లో పోటీ పెరిగిపోవడంతో ధరను తగ్గించారు. రూ.1,800 నుంచి రూ.2,200 మించి ధర ఇవ్వడం లేదు. ఇంకోవైపు ప్రభుత్వ కేంద్రాలు లేకపోవడం ఫలితంగా అన్నదాతలు నష్టపోతున్నారు.
Also Read : ప్రభుత్వ తీరుపై మాజీమంత్రి సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Youtube

