కొత్తగూడెంలో కాంగ్రెస్‌–సిపిఐ ఆధిపత్య పోరు

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సిపిఐతో రాష్ట్రస్థాయిలో సఖ్యత కొనసాగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయనే చర్చకు కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni) తాజా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. “కాంగ్రెస్ నాయకులు, కేడర్ పూర్తి సహకారం అందించకపోయినా నేను మాత్రం అందరితో మంచిగానే ఉంటాను” అంటూ ఆయన చేసిన ప్రకటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌–సిపిఐ మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరును తెరపైకి తెచ్చింది.

రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామిగా ఉన్నప్పటికీ, కొత్తగూడెం నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల నుంచి తమకు తగిన సహకారం అందడం లేదనేది కూనంనేని ప్రధాన అసంతృప్తిగా కనిపిస్తోంది. ఇతరులు సహకరించకపోయినా తాను మాత్రం రాజకీయ పరిపక్వతతో అందరితో కలిసిమెలిసి ఉంటున్నానని ఆయన పలు సందర్భాల్లో ప్రస్తావిస్తున్నారు. కొత్తగూడెం మండలం, టౌన్‌తో పాటు మున్సిపాలిటీలు, పంచాయతీల్లో తమ పార్టీకి పటిష్టమైన కేడర్ ఉందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, పదవులు, నామినేటెడ్ పోస్టుల కేటాయింపు సమయంలో కాంగ్రెస్ నాయకులు తమ వారికే ప్రాధాన్యం ఇవ్వాలని పట్టుబట్టడం వల్లే, స్థానికంగా సమస్యలు తలెత్తుతున్నాయనే అసంతృప్తి సిపిఐ వర్గాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే భావన సిపిఐ శ్రేణుల్లో బలంగా ఉందనడానికి ఈ పరిణామాలు నిదర్శనంగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవల ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణాలు, మంత్రులతో సమన్వయంపై కూనంనేని చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల్లో ఇద్దరితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అందరితో సమన్వయంతో వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. అయితే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, తనకు మధ్య గ్యాప్ ఉందని అంగీకరించడంతో పాటు, కొత్తగూడెంపై పొంగులేటి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదనే ధోరణిని వ్యక్తం చేశారు.

కొత్తగూడెం రాజకీయాలపై పొంగులేటి చూపుతున్న ఆసక్తి వల్లే ఇక్కడ ఆధిపత్య పోరు పెరుగుతోందనేది కూనంనేని వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశంగా కనిపిస్తోంది. అంతేకాకుండా, అధికారుల నియామకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వంటి అధికారిక కార్యక్రమాల్లోనూ తమకు తగిన స్వేచ్ఛ, ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తి కూనంనేని వర్గంలో ఉన్నట్లు ఆయన మాటలు సూచిస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు కోసం కాంగ్రెస్ పార్టీ అక్టోబర్ 23న సీపీఐతో చర్చలు జరిపింది. అయితే, ఈ చర్చల్లో పాల్గొన్న కూనంనేని పొత్తుపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నెలలో జరిగే కౌన్సిల్ సమావేశం అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. కాంగ్రెస్ స్థానిక నాయకత్వం వ్యవహారశైలి, తమకు అందుతున్న సహకారంపై అసంతృప్తితో ఉన్న ఆయన.. భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు కొనసాగించాలా వద్దా అనే అంశంపై కౌన్సిల్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>