మణుగూరు ఓసీ స్కామ్ కలకలం.. భూసేకరణలో భారీ గోల్‌మాల్?

కలం, ఖమ్మం బ్యూరో: మణుగూరు ఏరియాలో సింగరేణి సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓపెన్ కాస్ట్ గని విస్తరణ పనులు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే ఉన్న గని జీవితకాలం ముగుస్తుండటంతో కొత్తగా బొగ్గు ఉత్పత్తి కోసం సంస్థ విస్తరణకు శ్రీకారం చుట్టింది. వచ్చే 20 ఏళ్లలో సుమారు 37 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయాలని అంచనాగా, 2026-27 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ కోసం తిర్లాపురం, రామానుజవరం, మణుగూరు రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 800 ఎకరాల భూ సేకరణకు రూ. 421 కోట్ల నుంచి రూ. 487 కోట్ల వరకు నిధులను కేటాయించింది. విస్తరణ ద్వారా లభించే బొగ్గును ప్రధానంగా భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ అవసరాల కోసం ప్రత్యేక ఒప్పందం మేరకు కేటాయించనుంది.

నిర్లక్ష్యమా.. పరిహారం కొట్టేసేందుకా..

మరోవైపు భూసేకరణ క్షేత్రస్థాయితో తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రాజెక్ట్ తొలిదశలోనే అధికారులు మూడు గ్రామాల రికార్డులను పరిశీలించారు. మొత్తంగా 500 మంది మాత్రమే నిర్వాసితులు ఉండే అవకాశం ఉందని అంచనా వేశారు. స్థానిక రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమో లేదా లోపభూయిష్టమైన విధానాలో తెలియదు. కానీ ఆ సంఖ్య అనూహ్యంగా 1400 పెరిగింది. ఆర్అండ్ ఆర్ ప్యాకేజీలు, భారీ పరిహార సొమ్మును కొట్టేసేందుకు అనర్హులు సైతం జాబితాలోకి చేరడంతో స్థానికంగా అనుమానాలు తలెత్తాయి.
అసలు ఎలాంటి సంబంధం లేని పక్క జిల్లావాసులు కేవలం ఒకటి రెండు కుంటల భూమిలో వ్యవసాయం చేస్తున్నట్లు రికార్డుల్లో చూపించడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.

అధికారుల సహకారంతో దళారులు, అనర్హులు తెరవెనుక చక్రం తిప్పడంతో జాబితా తప్పుదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా సింగరేణిపై ఆర్అండ్ఆర్, పరిహార భారం మోయరాని గుది బండగా మారనుంది. 2013లో ఇదే గని ఏర్పాటు సమయంలోనూ భూముల గుర్తింపు, పరిహార చెల్లింపులపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ వివాదంపై సీబీసీఐడీ విచారణ జరిగిన విషయాన్ని కూడా స్థానికులు గుర్తు చేస్తున్నారు. మరోసారి అదే తరహాలో అక్రమాలు పాల్పడుతున్నారనే అనుమానాలు నెలకొన్నాయి.

పెరిగిన అదనపు ఆర్థికభారం

ఇలాంటి పరిణామాలు సింగరేణికి సవాల్ గా మారాయి. అనర్హులను కూడా నిర్వాసితుల జాబితాలో చేర్చడంపై సంస్థకు అదనపు ఆర్థిక భారం పెరిగింది. దీన్ని అరికట్టడడం పెద్ద పరీక్షగా తయారైంది. గత వివాదాల దృష్ట్యా, ఈసారి భూసేకరణ, నిర్వాసితుల జాబితా రూపకల్పనను అత్యంత పారదర్శకంగా పూర్తి చేయడం అత్యవసరమైంది. లేనిపక్షంలో నిర్దేశిత గడువులోగా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యానికి ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది.

తక్షణం స్పందిస్తేనే నిర్వాసితులకు న్యాయం

మణుగూరు ఓసీ విస్తరణ ప్రాజెక్ట్ సింగరేణి భవిష్యత్ ఉత్పత్తికి, స్థానిక విద్యుత్ అవసరాలకు అత్యంత కీలకంగా ఉంది. అయితే రెవెన్యూ యంత్రాంగం సడలింపులు, అక్రమ సర్వేలతో సంస్థకు ఆర్థిక నష్టంతో పాటు ప్రాజెక్టు ఆలస్యమయ్యే ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపిస్తేనే నిజమైన నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>