జాతీయ షూటింగ్ పోటీల్లో పాల్వంచ బాలిక ప్రతిభ

కలం, ఖమ్మం బ్యూరో : ఢిల్లీలో జరిగిన ‘డీఏవీ జాతీయ స్థాయి క్రీడా పోటీలు-2026’లో(DAV National Sports) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన యువ క్రీడాకారిణి అద్భుత ప్రతిభ కనబరిచింది. 14 సంవత్సరాల లోపు బాలికల 10 మీటర్ల ఓపెన్ సైట్ రైఫిల్ షూటింగ్ విభాగంలో పాల్గొన్న ఆమె సోమవారం రజత పతకం సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. పాల్వంచలోని డీఏవీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మొహమ్మద్ ఫైస్తా సుమయ్య గత ఏడాది కాలంగా జిల్లా ఇండోర్ రైఫిల్ షూటింగ్ రేంజ్‌లో శిక్షణ పొందుతుంది. ఢిల్లీలో జరిగిన ఈ జాతీయ స్థాయి పోటీల్లో ఆమె ఈ ఘనత సాధించింది. జిల్లాలోని డీఏవీ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో పతకం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

ఈ సందర్భంగా విద్యార్థిని ఫైస్తా సుమయ్యను జిల్లా యువజన, క్రీడల అధికారి ఎం. పరంధామ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలపై ఆమె చూపిన అంకితభావం, కృషి, పట్టుదల ఎంతో స్ఫూర్తిదాయకమని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే రైఫిల్ షూటింగ్ కోచ్ అబ్దుల్ నబీ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా క్రీడా అధికారులు సైతం ఆమెను అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.మొహమ్మద్ ఫైస్తా సుమయ్య సాధించిన ఈ విజయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైఫిల్ షూటింగ్ క్రీడకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోందని అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>