‘యాదగిరిగుట్ట దేవస్థానం’ టెండర్‌పై వివాదం!

కలం, యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండకింద పార్కింగ్‌ ప్రాంతంలోని బొమ్మల దుకాణాల టెండర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. గతంలో ఉన్న అద్దె కంటే తక్కువ మొత్తానికి షాపు నంబర్‌–4 టెండర్‌ ఖరారు కావడంపై పక్కనే ఉన్న దుకాణాల నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ టెండర్‌ను రద్దు చేయాలని కోరుతూ దేవస్థానం కార్యనిర్వహణాధికారికి వినతిపత్రం సమర్పించారు.

వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం.. షాపు నంబర్‌–1 గతంలో ఏడాదికి రూ.13.20 లక్షల అద్దె ఉండగా, ప్రస్తుతం రూ.15 లక్షలకు, షాపు నంబర్‌–2 అద్దె రూ.13.86 లక్షల నుంచి రూ.18.18 లక్షలకు పెరిగింది. ఈ రెండు దుకాణాలకు అదనంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, షాపు నంబర్‌–4కు గతంలో ఏడాదికి రూ.12.96 లక్షల అద్దె ఉండగా, అక్టోబర్‌ 18న నిర్వహించిన టెండర్‌లో రూ.10.80 లక్షలకు ఖరారైందని తెలిపారు. దీంతో గత అద్దెతో పోలిస్తే రూ.2.16 లక్షలు తగ్గినట్లు వివరించారు.

ఒకే ప్రాంతంలో ఉన్న దుకాణాలకు అద్దెల విషయంలో ఇంత వ్యత్యాసం ఎందుకని వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. తమ దుకాణాలకు అద్దెలు పెంచి, పక్కనే ఉన్న మరో దుకాణానికి తక్కువ మొత్తానికి టెండర్‌ ఖరారు చేయడం వల్ల తమకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టెండర్‌కు ముందు గతంలో ఉన్న అద్దె మొత్తానికి తక్కువగా దుకాణం కేటాయించబోమని చెప్పడంతో ఎవరూ ఆసక్తి చూపలేదని వారు తమ వినతిలో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో షాపు నంబర్‌–4 టెండర్‌ ప్రక్రియను పునఃపరిశీలించి, రద్దు చేయాలని వ్యాపారులు దేవస్థానం అధికారులను కోరారు. ఈ టెండర్‌ వ్యవహారంపై దేవస్థానం అధికారులు ఏ విధంగా స్పందిస్తారు? టెండర్‌ ఖరారులో అనుసరించిన నిబంధనలు ఏమిటి? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>