మత్తులో యువత.. చిత్తవుతున్న భవిత!

కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: విద్యాబుద్ధులు నేర్చుకుని ఇతరులకు ఆదర్శంగా నిల‌వాల్సిన యువత వ్యసనాలకు బానిస అవుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో యువత, విద్యార్థులు మద్యం, ఇతర మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఈ ఏడాది జనవరి నుండి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 70 కేసుల్లో 145 మందిని అరెస్టు చేసి సుమారు 8 కిలోల గంజాయిని సీజ్ చేశారు. యువకులు మత్తులో చిత్తవుతూ, బంగారు భవితకు ముప్పుతెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు చదువు, క్రీడలతో పోటీపడే విద్యార్థులు, నేడు ‘కిక్కు’ కోసం వెతుకులాటలో పడ్డారు. పట్టణాల నుండి మారుమూల గ్రామాల వరకు మద్యం మహమ్మారి యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేవలం మద్యం మాత్రమే కాదు, గంజాయి వంటి ఇతర మత్తు పదార్థాలు కూడా జిల్లాలోకి చాపకింద నీరులా విస్తరిస్తుండటం ఆందోళన కలిగించే విషయం. గత కొన్నాళ్లుగా జిల్లాలో నమోదవుతున్న ఘటనలు పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇటీవల గద్వాల, మహబూబ్‌నగర్ పరిసరాల్లో మద్యం మత్తులో యువకులు బస్సు డ్రైవర్లపై, పోలీసులపై దాడులకు తెగబడిన ఘటనలు సంచలనం సృష్టించాయి.

ఒకప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ అయినా హైదరాబాద్, బెంగళూరు, ముంబై లాంటి పట్టణాలకే పరిమితమైన కల్చర్ రాను రాను ఇప్పుడు గ్రామాల్లోనూ గంజాయి సాధారణ మత్తు మందుగా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో కొందరు రైతులు గంజాయి సాగును అంతర‌ పంటగా వేశారు. ఈ విషయం తెలిసిన ఎక్సైజ్ అధికారులు ఆ పంటను ధ్వంసం చేశారు .అలాగే తుర్కపల్లి శివారులో ఎక్సైజ్ అధికారులు గంజాయి సాగును గుర్తించి తొలగించారు. అలాగే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువల వెంట, గత ఆరు నెలల క్రితం భవాయిపల్లి చెరువు, అమరగిరి వెళ్లే రోడ్డుపై 20 మందిని గంజాయికి బానిసైన వాళ్ళను గుర్తించి అధికారులు కౌన్సిలింగ్ ఇప్పించారు.

జైలు పాలవుతున్న యువత

కేవలం ఎంజాయ్ మెంట్ కోసం మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన యువకులకు కోర్టులు జైలు శిక్షలు విధిస్తున్నాయి. ట్రాఫిక్ పోలీసులు జరిపే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడుతున్న వారిలో యువకులే అధికంగా ఉండడంతో యువకుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే.. పాఠశాల, కళాశాల విద్యార్థులు కూడా ఈ వ్యసనాలకు బానిసలవుతున్నారు. పుస్తకాలు ఉండాల్సిన బ్యాగుల్లో మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. కొందరు విద్యార్థులు వాటర్ బాటిల్స్‌లో మద్యం కలిపి తరగతి గదులకు తెస్తున్నారన్న వార్తలు విద్యావ్యవస్థనే నివ్వెరపోయేలా చేశాయి.పరీక్షల్లో మార్కుల ఒత్తిడి, తోటి స్నేహితుల ప్రోద్బలం వారిని ఈ రొంపిలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది.

గంజాయి.. మరో ప్రమాద ఘంటిక

మద్యం అలవాటు క్రమంగా గంజాయి వంటి ప్రమాదకర మత్తు పదార్థాల వైపు యువతను నడిపిస్తోంది. మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో గంజాయి రవాణా, విక్రయాల్లో యువకులు పట్టుబడుతుండటం ఆందోళనకరం. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కొందరు యువకులు పెడ్లర్లుగా మారుతున్నారు. దీంతో ఎంతో పరువు మర్యాదలు గల కుటుంబాలు సైతం చిన్నాభిన్నమవుతున్నాయి. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులపై దాడులు చేయడం, మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడటం వంటి విషాద ఘటనలు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో కుటుంబ ఆరోగ్య సర్వేల ప్రకారం పురుషుల్లో మద్యపానం అధికంగా ఉండటం వల్ల గృహ హింస‌ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది అంతిమంగా మహిళలు, పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలుస్తోంది.

పోలీసు యంత్రాంగం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నప్పటికీ, మార్పు అనేది వ్యక్తిగత స్థాయి నుండే మొదలవ్వాలి. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను గమనిస్తూ, వారు ఎవరితో తిరుగుతున్నారో ఆరా తీయాలి. విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి, మత్తు వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు వివరించాలి. మత్తులో తూగుతున్న ఈ తరాన్ని మేల్కొలపాలి. లేదంటే ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి ఆ మత్తులోనే చిత్తయ్యే ప్రమాదం పొంచి ఉంది.

ఇతర రాష్ట్రాల నుండే పాలమూరుకు గంజాయి

ఇతర రాష్ట్రాల నుండే పాలమూరుకు గంజాయి భారీగా వస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా జడ్చర్ల పారిశ్రామిక కారిడార్ ప్రాంతంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు పనిచేయడం మూలంగా ఆయా రాష్ట్రాలకు వెళ్లినప్పుడు గంజాయి తమ వెంట తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అక్రమంగా కొంతమంది తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. పోలీసులు ఎక్సైజ్ శాఖ ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ గంజాయి ర‌వాణా చేయడం ఆగడం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>