భారీ వర్షాలపై కలెక్టర్ సమీక్ష.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కలం, ఖమ్మం బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ (Collector Divakara) సోమవారం రాత్రి వివిధ శాఖల అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించి, తీసుకోవాల్సిన విపత్తు నిర్వహణ చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు 24/7 ప్రాతిపదికన మూడు షిఫ్టుల్లో కంట్రోల్ రూమ్ నిర్వహించాలని, క్షేత్రస్థాయిలో తహసీల్దార్లు నోడల్ అధికారులుగా ఉంటూ అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాలేరు, వైరా రిజర్వాయర్ల నీటి మట్టాలను పరిశీలిస్తూ, నీరు ఓవర్‌ఫ్లో అయ్యే ముందే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. మున్నేరు వాగు పరివాహక ప్రాంత ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన చోట పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

గంటకు 60–70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, రోడ్లపై చెట్లు కూలితే వెంటనే తొలగించేందుకు వుడ్ కటింగ్ మెషిన్లతో సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ప్రమాదకర కాజ్‌వేలు, వాగుల వద్ద పోలీసులతో కాపలా ఏర్పాటు చేయాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని, ఒంటరి వృద్ధులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వర్ష తీవ్రతను బట్టి పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించే అధికారాన్ని స్థానిక ఎంఈఓలు, సీడీపీఓలకు ఇస్తూ ముందస్తు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అధికారులందరూ హెడ్‌క్వార్టర్స్‌లో అందుబాటులో ఉండి, ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా సహాయక చర్యలు అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>