గ్రామాల అభివృద్ధిపై మంత్రి శ్రీహరి సమీక్ష

కలం, నారాయణపేట: మక్తల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా, ప్రతి గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆదివారం అమరచింత మండలంలోని 14 గ్రామాల అభివృద్ధిపై కూలంకషంగా చర్చిస్తూ, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ప్రతి గ్రామానికి 20 నుంచి 30 నిమిషాల సమయం కేటాయించి, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, తక్షణమే పరిష్కరించాల్సిన అంశాలు, ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై వివరంగా చర్చించారు. గ్రామాల వారీగా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కార మార్గాలు, చేపట్టాల్సిన పనులు, అమలు చేయాల్సిన కార్యాచరణతో మంత్రి స్వయంగా ప్రత్యేక నోట్‌ రూపొందించి, నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. సాధారణంగా పట్టణాలు, మండల కేంద్రాల్లోని సమస్యలపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నప్పటికీ, మారుమూల గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కారం కావాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. ప్రతి గ్రామానికి సమాన ప్రాధాన్యతనిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈ సమీక్షలు దోహదపడనున్నాయని తెలిపారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రహదారులు, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, మౌలిక వసతులు తదితర అంశాలపై ప్రాధాన్యత క్రమంలో చర్యలు తీసుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. సమస్యలను గుర్తించడానికే పరిమితం కాకుండా, వాటి పరిష్కారానికి గడువును నిర్ణయించి పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు తెలిపారు.ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే మక్తల్ నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందనే దృక్పథంతో స్థానిక సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి గ్రామాల వారీగా సమీక్షలు దోహదపడనున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>