కలం, జోగులాంబ గద్వాల: పేద ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐసీసీ సెక్రటరీ రవీంద్రదాస్ (Ravindra Das), డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. ‘ఓటు బచావో.. దేశ్ బచావో’ నినాదంతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఓటు బచావో.. దేశ్ బచావో కార్యక్రమంలో భాగంగా ఆదివారం గద్వాల జిల్లా కేంద్రంలోని అనంత ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
అక్టోబర్ 1 నుంచి రాహుల్ గాంధీ నాయకత్వంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) పేరుతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో కుమ్మక్కై సామాన్య ప్రజల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి మాజీ ప్రధానుల హయాంలో జరిగిన ఎస్ఐఆర్ ప్రక్రియ కేవలం ఓటు హక్కు లేని అర్హులైన పేర్లను కొత్తగా చేర్చడానికే ఉపయోగపడిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత మోదీ-అమిత్ షా ప్రభుత్వం మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే సక్రమంగా ఓటు హక్కు ఉన్నవారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.
గతంలో ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ), ప్రతిపక్ష నేతతో కూడిన అత్యున్నత కమిటీ ఎన్నికల కమిషనర్లను (ఈసీ) ఎంపిక చేసేదని, కానీ మోదీ ప్రభుత్వం 2023లో చట్టాన్ని మార్చి సీజేఐ స్థానంలో కేంద్ర హోంమంత్రిని చేర్చడం ద్వారా వ్యవస్థలో పారదర్శకతను పూర్తిగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌లను తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటు హక్కు ప్రాధాన్యాన్ని ప్రజలకు వివరించాలని కోరారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటు నమోదు కాని వారిని గుర్తించి, ఓటు నమోదు చేసుకునేలా సహకరించాలని సూచించారు.
ప్రతి బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశంపై జిల్లా, అసెంబ్లీ, మండల, గ్రామస్థాయిల్లో చర్చించి ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఢిల్లీ నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే లక్ష్యంతో నవంబర్ 1న దేశవ్యాప్త ఆందోళన చేపడుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి 15 వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సర్ పరిశీలకులు సిద్దేశ్వర్, శ్రీనివాస్ గౌడ్, పీసీసీ నాయకులు శ్రీకాంత్, శత్రు, గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి,వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.

