నిరంజన్‌ రెడ్డి అహంకారానికి భయపడేది లేదు: ఎమ్మెల్యే మేఘారెడ్డి

కలం, వనపర్తి: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) తీవ్ర విమర్శలు చేశారు. నడిబజారులో చెప్పుతో కొడతానంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేయడం రాజకీయ హుందాతనానికి నిదర్శనం కాదని అన్నారు. అహంకారపూరిత వ్యాఖ్యలకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. ఆదివారం వనపర్తిలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలనలో వనపర్తి నియోజకవర్గంలో పలువురు నాయకులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని మేఘారెడ్డి ఆరోపించారు. 32 మంది బీసీ నాయకులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేయించారని, విలేకరులపైనా అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలున్నాయని విమర్శించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, నిరుద్యోగులు, వివిధ వర్గాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పోస్టులకు ధరలు నిర్ణయించి కమిషన్లు వసూలు చేశారన్న ఆరోపణలపైనా సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అభివృద్ధిపై చర్చకు సిద్ధం

బీఆర్‌ఎస్‌ తొమ్మిదేళ్ల పాలనలో ఏం సాధించిందో, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మూడేళ్లలో ఏం చేయగలిగిందో ప్రజల సమక్షంలో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మేఘారెడ్డి సవాల్‌ విసిరారు. గత ప్రభుత్వ పాలనకు సంబంధించిన పత్రాలతో నిరంజన్‌రెడ్డి చర్చకు రావాలని సూచించారు. అభివృద్ధి విషయంలో ఎవరి పాలన ఎలా ఉందో ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజల తీర్పును గౌరవించాలని హితవు పలికారు.

రాజకీయాల్లో హుందాతనం ఉండాలి

వయసులో పెద్దవారైన నాయకులు మాటతీరు, ప్రవర్తనలో హుందాతనాన్ని పాటించాలని మేఘారెడ్డి అన్నారు. వెయ్యి మందితో కలిసి వచ్చి నడిబజారులో చెప్పుతో కొడతానంటూ మాట్లాడటం ఏ విధమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. ఎవరెంత మందితో వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. వనపర్తి విద్యావంతులు, మేధావులు, రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాలను గమనించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో నిరంజన్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కడం కూడా అనుమానమేనని, ఒకవేళ టికెట్‌ వచ్చినా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మేఘారెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు, బెదిరింపుల కంటే అభివృద్ధి, ప్రజాసేవకే ప్రాధాన్యమివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు శివసేనారెడ్డి, జిల్లా పార్టీ కార్యవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>