కలం, ఖమ్మం బ్యూరో : రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా గోదావరి జలాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని.. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) అధికారులను ఆదేశించారు. దుమ్ముగూడెం ఆనకట్టపై (Dummugudem Barrage) ఒక టీఎంసీ నీటిని నిల్వ చేయడమే లక్ష్యంగా ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామ పరిధిలోని దుమ్ముగూడెం ఆనకట్టను భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
అమ్మగారిపల్లి నుంచి దుమ్ముగూడెం వరకు పడవలో ప్రయాణిస్తూ ఆనకట్ట పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి, ఇసుక బస్తాలతో నీటిని నిల్వ చేసే పనులను సమీక్షించారు. దుమ్ముగూడెం వైపు ఆనకట్టపై సుమారు ఒక మీటర్ ఎత్తున ఇసుక బస్తాల పొరలను ఏర్పాటు చేసి ఒక టీఎంసీ నీటిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రోజుకు 10 వేల నుంచి 15 వేల బస్తాలు అమర్చేలా ప్రణాళిక రూపొందించాలని, అవసరమైతే అదనపు కార్మికులను, పడవలను పెట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం పెరిగినప్పటికీ పనులకు అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంపై వాతావరణ శాస్త్రవేత్తలు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ఈ ఏడాది వర్షపాతం లోటు, రిజర్వాయర్లలో పరిమిత నీటి నిల్వల కారణంగా భూగర్భ జలాలపై ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను భయాందోళనలకు గురిచేయడం తమ ఉద్దేశం కాదని, నష్టాలను నివారించేందుకు ముందుగానే ఆత్మస్థైర్యం, అవగాహన పెంపొందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
రైతులు రబీ సాగులో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాలు, విద్యుత్ సరఫరాను అంచనా వేసుకుని సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా సాగర్ ఆయకట్టుకు నీరు అందించడంతో పాటు వైరా, లంకసాగర్ ప్రాజెక్టులు, తుమ్మల చెరువు, సింగభూపాలం తదితర చెరువులను నింపేలా చర్యలు చేపట్టామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కాలువల మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ, అమ్మగారిపల్లి సర్పంచ్ కవిత, సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

