కలం, నల్లగొండ : నవంబర్ 1, 2 తేదీలలో కట్టంగూర్ మండల కేంద్రంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) మహాసభలను విజయవంతం చేయాలని సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండలోని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బక్కా శ్రీనివాస చారి అధ్యక్షతన ఆఫీసు బేరర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాసభల గోడ పత్రికను (పోస్టర్) నాయకులు విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, విద్యార్థులందరికీ నాణ్యమైన ఉచిత విద్యను అందించడం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ మహాసభలు జరుగుతాయని తెలిపారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణపై సభలో విస్తృతంగా చర్చించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేందుకు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధనకు టీఎస్ యూటీఎఫ్ (TSUTF) నిరంతరం కృషి చేస్తోందన్నారు.
సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం ఉపాధ్యాయ లోకమంతా ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డబ్ల్యూఎస్ రాష్ట్ర కోశాధికారి ఎడ్ల సైదులు, నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శేఖర్ రెడ్డి, బడుగు అరుణ, రాష్ట్ర కమిటీ సభ్యురాలు జాల అరుణ, జిల్లా కార్యదర్శులు చిక్కుల రామలింగయ్య, గేర నరసింహ, మోర్తాల శ్రీనివాస్ రెడ్డి, నలపరాజు వెంకన్న, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

