కలం, ఖమ్మం బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఖమ్మం (Khammam) జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్(Collector Divakara) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
భారత వాతావరణ శాఖ అక్టోబర్ 25న జారీ చేసిన బులెటిన్ ప్రకారం.. ఈ నెల 27న జిల్లాలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. అక్టోబర్ 28న అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించినట్లు తెలిపారు. అక్టోబర్ 29న కూడా ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
వర్షాల నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు. సంబంధిత శాఖల అధికారులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, జిల్లా యంత్రాంగం సూచనలను ప్రజలు, రైతులు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ కోరారు.

