కలం, మునుగోడు : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో కరువు (Drought) పరిస్థితులు నెలకొన్నాయని, నిత్యావసర ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడం, రైతులకు భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. ఆదివారం చండూరు మండల కేంద్రంలోని రాజశ్రీ బ్యాంక్ హాల్లో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎల్‌నినో ప్రభావంతోనే కరువు వచ్చిందని చెప్పడం సరికాదని, ప్రభుత్వ విధానాలు, పాలనా వైఫల్యాల వల్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జగదీష్ రెడ్డి (Jagadish Reddy) ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు హెలికాప్టర్లు లేకుండా నియోజకవర్గాల్లో పర్యటించడం లేదని విమర్శించారు. గతంలో తాను జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సుమారు 500 కిలోమీటర్లు పర్యటించినట్లు గుర్తుచేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంట్రాక్టులు, మంత్రి పదవుల కోసం పార్టీ అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారని, మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిపై తగిన శ్రద్ధ చూపడం లేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి ఉందని, కరువు పరిస్థితుల్లో రైతులకు, ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జిల్లాలో మంత్రులు ఉన్నప్పటికీ కష్టకాలంలో ప్రజలకు భరోసా కల్పించే నాయకత్వం కనిపించడం లేదని విమర్శించారు. గత మూడేళ్లలో నియోజకవర్గానికి మంత్రులు, ఎంపీలు రాలేదని ఆయన ఆరోపించారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి వెంకటనారాయణగౌడ్, పాల్వాయి స్రవంతి, పల్లె రవికుమార్, మాజీ ఎంపీపీ తోకల వెంకన్న, మండల అధ్యక్షుడు పాటల వెంకన్న, మునగాల నారాయణరావు, గుర్రం వెంకటరెడ్డి, ఎత్తపు మధుసూదన్‌రావు, అనిల్‌రావు, పెద్దగోని వెంకన్నగౌడ్, తదితర బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Also Read : కోహ్లీ, బుమ్రా లేకుండానే రహానే ఆల్‌టైమ్ టెస్ట్ టీమ్!
Follow Us On : WhatsApp

