కలం, యాదగిరిగుట్ట : ‘గుడి అభివృద్ధి కోసం భూములిచ్చినం.. మా బతుకులు బాగుపడతాయని ఆశపడ్డం.. ఉద్యోగాలు ఇస్తామన్నారు.. దుకాణాలు కేటాయిస్తామన్నారు.. కానీ ఏళ్లు గడుస్తున్నా మా బతుకులు మాత్రం మారలేదు’ అని యాదగిరిపల్లి (Yadagiripalli) దళిత భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన తమకు ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం దేవస్థానం ఈవో కార్యాలయం ఎదుట బైఠాయించారు.
దేవస్థానం అభివృద్ధి కోసం తమ భూములను త్యాగం చేసిన కుటుంబాలకు ఉపాధి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు దేవస్థానం అధికారులపై ఉందని బాధితులు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవస్థానానికి సంబంధించిన ఆధ్యాత్మికవాడకు తాము భూములిచ్చిన ప్రాంతంలోనే నిర్మించారని తెలిపారు. భూములు ఇవ్వని కొందరు వర్తకులకు సైతం దుకాణ సముదాయాలు నిర్మించి కేటాయించారని, ప్రధాన రహదారి విస్తరణలో భూములు కోల్పోయిన వారికి పరిహారంతో పాటు దుకాణాలు కల్పించారని గుర్తుచేశారు. దేవస్థానం అభివృద్ధి కోసం భూములిచ్చిన తమకు మాత్రం ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు.
హామీలు ఇచ్చి.. పట్టించుకోవడం మానేశారా?
భూములు ఇచ్చిన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఉద్యోగాలు, దుకాణ సముదాయాలు, కులవృత్తులకు సంబంధించిన పనుల్లో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని నిర్వాసితులు తెలిపారు. ఆ హామీలను నమ్ముకుని ఎదురుచూస్తున్నా తమ కుటుంబాలకు న్యాయం జరగలేదని వాపోయారు. భూములు కోల్పోవడంతో తమ జీవనాధారానికి ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఉపాధి కల్పించేదాకా పోరాటం ఆపేదిలేదంటున్న బాధితులు!
దేవస్థాన పరిధిలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు టెండర్ ప్రక్రియ లేకుండా చెప్పుల భద్రపరిచే బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు. నిత్యకల్యాణంలో డప్పులు వాయించే అవకాశం కల్పించాలని, దేవస్థానంలో శాశ్వత ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కొండకింద దుకాణ సముదాయాలు కేటాయించడంతో పాటు దేవస్థాన పరిధిలోని ఇతర పనుల్లోనూ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అర్హత కలిగిన యాదగిరిపల్లి (Yadagiripalli) దళిత యువతకు ఉద్యోగాలు కల్పించి, నిర్వాసిత కుటుంబాలకు శాశ్వత జీవనోపాధి చూపించాలని కోరుతున్నారు.
అధికారులు, పాలకమండలి స్పందించాలి :
భూములు తీసుకున్నప్పుడు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం, దేవస్థానం అధికారులు, పాలకమండలి స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించి, కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ దేవస్థానం ఈవో కార్యాలయంలో డీఈవో దోర్భల భాస్కరశర్మకు వినతిపత్రం అందజేశారు. దేవస్థానం అభివృద్ధికి భూములిచ్చిన కుటుంబాలకు న్యాయం చేయడంలో ఇకనైనా జాప్యం జరగకూడదని బాధితులు కోరుతున్నారు.
దేవుడి సన్నిధిలో సేవ చేసే అవకాశం కోసం, తమ కుటుంబాల బతుకుదెరువు కోసం ఎదురుచూస్తున్న దళిత రైతుల సమస్యపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో రెండో వార్డు కౌన్సిలర్ బూడిద మధు, మాజీ వార్డు సభ్యుడు బూడిద ఐలయ్య, నర్సింహా (చిట్టీలు), యాదగిరి, శ్రీను, నాగరాజు, మచ్చేందర్, అయిలమ్మ, కమలమ్మ, అండాలు, స్వరూప, అనిత, శ్యామల, లక్ష్మి, కిష్టమ్మ, హేమలత, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

