కలం, వనపర్తి: వనపర్తి (Wanaparthy) నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి ఇప్పటికే రూ.680 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Tudi Megha Reddy)తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఖిల్లాఘణపురం మండలం మామిడిమాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం, పాదపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
పాఠశాల అభివృద్ధికి రూ.కోటి లక్ష్యం
తాను చదువుకున్న మామిడిమడ పాఠశాలను అభివృద్ధి చేయడం సంతృప్తినిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం రూ.కోటి కార్పస్ ఫండ్ సమకూర్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. గ్రామస్థులు, పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకొచ్చి సహకరించాలని కోరారు. ఆయన పిలుపుతో కార్యక్రమంలో పలువురు దాతలు విరాళాలు ప్రకటించగా, దాదాపు రూ.20 లక్షలు సమకూరాయి.
నాలుగు పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యం
నియోజకవర్గంలో తొలి విడతగా నాలుగు ఉన్నత పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నట్లు మేఘారెడ్డి చెప్పారు. మామిడిమాడ, ఖిల్లాఘణపురం మండల కేంద్రం, వనపర్తి హరిజనవాడ, పెబ్బేరు ఉన్నత పాఠశాలలను ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసినట్లు వివరించారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో అదనపు గదులు, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు టేబుళ్లు అందించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యం ఇస్తూ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందన్నారు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 70 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఎంపిక చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించగా, వాటి నిర్మాణాలకు రూ.793 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలోనూ తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ పాఠశాలల అభివృద్ధికి మరిన్ని నిధులు వెచ్చిస్తామని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం
ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నారని, వాటి అభివృద్ధికి తల్లిదండ్రులు, గ్రామస్థులు తమవంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. అనవసర ఖర్చులు తగ్గించుకుని ఆదా చేసిన మొత్తాన్ని పాఠశాలల అభివృద్ధికి విరాళంగా అందించాలని పిలుపునిచ్చారు. వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు కోసం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మేఘారెడ్డి చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయం, శుద్ధి నీటి కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు అధ్యక్షుడు నవనీత క్యామరాజు, ప్రధానోపాధ్యాయుడు చెన్నప్ప, విజయభాస్కర్‌రెడ్డి, వెంకట్రావు, సర్పంచ్ లింగం, సాయిచరణ్‌రెడ్డి, మండలాధ్యక్షుడు కృష్ణయ్య, ఉపసర్పంచ్ భద్రయ్య, మాజీ సర్పంచ్ మోహన్‌జీ, జితేందర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రావు, ఎంఈవో జయశంకర్, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

