కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: పాలమూరు జిల్లా రైతాంగానికి అన్యాయం చేసే విధంగా డిండి లిఫ్టు పనులను (Dindi Lift Works) కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ అధికారుల సమీక్షలో ఆదేశాలు ఇవ్వడం జిల్లా ప్రజలకు తీవ్రని అన్యాయమని ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ నేతలు అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని టీఎన్జీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు జిల్లా ప్రజలను, ప్రజాప్రతినిధులను, ఉద్యమకారులను ఏ మాత్రం పట్టించుకోకుండా సీఎం ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru-Rangareddy Project)లో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి లిఫ్ట్ కు నీళ్లు మళ్లించడం జరిగితే పాలమూరు జిల్లాకు తీవ్రం అన్యాయం చేసిన వారు అవుతారని ఆయన పేర్కొన్నారు.
నల్గొండ జిల్లాకు అదనంగా సాగునీటినీ మళ్లించాలంటే నాగార్జునసాగర్ పెద్ద సోర్సుగా ఉందని అయినా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీటిని తరలించి పాలమూరును ఎడారిగా మార్చాలి అనుకుంటున్నారా? అంటూ ఆయన ప్రశ్నించారు. పాలమూరు బిడ్డగా పాలమూరు ప్రజలకు నిజంగా న్యాయం చేయాలనే కాంక్ష సీఎం రేవంత్ రెడ్డికి ఉంటే మొదట పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, ఇది ఎంత మాత్రం పాలమూరు ప్రజలు హర్షించరని వ్యాఖ్యానించారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి పునః సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. డిండి లిఫ్టును పాలమూరు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి కో చైర్మన్లు రాఘవాచారి, బెక్కెం జనార్దన్, చిన్న కిష్టయ్య, అనీఫ్ అహ్మద్, ఖలీల్, రఫిక్ పటేల్, సారంగి తదితరులు పాల్గొన్నారు.

