వాల్మీకి బోయ‌ల సంక‌ల్ప స‌భ‌.. ద‌ద్ద‌రిల్లిన గ‌ద్వాల‌!

​కలం,‌ జోగులాంబ గద్వాల: గద్వాల జిల్లా కేంద్రంలోని వాల్మీకి భవన్‌లో శనివారం నిర్వహించిన “వాల్మీకి ఎస్టీ సాధన సంకల్ప సభ” ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవదుర్గ ఎమ్మెల్యే కరెమ్మ, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి, బాసు హనుమంతు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ​సభకు ముందు జిల్లా కేంద్రంలోని ధరూర్ మెట్టు నుంచి వాల్మీకి భవన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వాల్మీకి బోయలకు (Valmiki Boya) ఎస్టీ హోదా కల్పించాలని కోరుతూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

​గత 70 ఏళ్లుగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని అనేక ఉద్యమాలు చేస్తున్న‌ట్లు నాయ‌కులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త‌మ‌ను 1956 నుంచి బీసీలుగానే పరిగణించడం విచారకరమని నాయకులు పేర్కొన్నారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ​తెలంగాణ ప్రభుత్వం 2015 లో వేసిన చెల్లప్ప కమిషన్ నివేదిక ప్రకారం వాల్మీకి బోయలు సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారని వెల్లడైంద‌న్నారు.

దీని ఆధారంగా 2016, 2023లో అసెంబ్లీలో తీర్మానాలు చేసినా కేంద్ర ప్రభుత్వం ఆమోదించలేదని గుర్తు చేశారు. 1968లో ఎస్టీ జాబితాలో ఉన్న వాల్మీకీలను 1977 జులై 27న కేవలం ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితం చేశారని, ఆ రోజు జరిగిన అన్యాయాన్ని వెంటనే సరిదిద్ది మైదాన ప్రాంత వాల్మీకి బోయలందరికీ ఎస్టీ హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ​”మా ఎస్టీ హక్కులు మాకు దక్కే వరకు పోరాటం ఆగదు” అని నాయకులు స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో వివిధ వాల్మీకి సంఘాల నాయకులు, వివిధ మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గ్రామాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>