కలం, వరంగల్ బ్యూరో: గోదావరిలో నీరు సముద్రం పాలవుతుంటే హైదరాబాద్ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడాలా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి వెంటనే గోదావరి జలాలను ఎత్తిపోసి జలాశయాలు, చెరువులను నింపాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కే.పి.వివేకానంద గౌడ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సందర్శించారు.
750 టీఎంసీలు సముద్రంలోకి..
జూన్ నుంచి ఇప్పటివరకు 750 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలో కలిశాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. కనీసం 250 టీఎంసీల నీటినైనా ఎత్తిపోసి ఉంటే జలాశయాల్లో నిల్వలు పెరిగి, భూగర్భ జలమట్టాలు మెరుగుపడేవని అన్నారు. హైదరాబాద్ ఏడాది తాగునీటి అవసరాలకు సుమారు 10 టీఎంసీల నీరు సరిపోతుందని ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ పేర్కొన్నారు.
రోజుకు 7 వేల ట్యాంకర్ బుకింగ్స్..
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులకు ఒకసారి కూడా సక్రమంగా నీరు సరఫరా కావడం లేదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. తక్కువ పీడనంతో నీరు వస్తోందని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. అక్టోబర్‌లో రోజుకు సుమారు 7,000 వాటర్ ట్యాంకర్ బుకింగ్స్ జరుగుతున్నాయని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. సింగూరు, మంజీరా జలాశయాల్లో నిల్వలు తగ్గుతున్నాయన్న ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం స్పందించాలని డిమాండ్..
ఎల్ నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తే అవకాశముందని గతంలోనే హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకుని హైదరాబాద్ ప్రజలకు తాగునీటి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

