11 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్.. బోధన చరిత్ర!

క‌లం, స్పోర్ట్స్‌: చెస్‌లో 11 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్‌ టైటిల్ సాధించి చరిత్ర సృష్టించింది భారత సంతతికి చెందిన బ్రిటిష్ క్రీడాకారిణి బోధన శివానందన్ (Bodhana Sivanandan). 11 ఏళ్ల 7 నెలల 16 రోజుల వయసులో ఈ ఘనత సాధించింది. దీంతో 1988లో హంగేరీకి చెందిన దిగ్గజ క్రీడాకారిణి జుడిట్ పొల్గర్ నెలకొల్పిన రికార్డును 38 ఏళ్ల తర్వాత బద్దలుకొట్టింది. లండన్‌లోని హారోకు చెందిన బోధన.. మాంటెనెగ్రోలోని బుడ్వాలో జరిగిన యూరోపియన్ ఉమెన్స్ క్లబ్ కప్‌లో ‘షీ ప్లేస్ టు విన్ లయనెస్’ జట్టు తరఫున ఆడింది. ఏడో, చివరి రౌండ్‌లో స్వీడన్‌కు చెందిన విక్టోరియా జోహాన్సన్‌ను 32 ఎత్తుల్లో ఓడించింది. ఈ విజయంతో ఏడు గేమ్‌ల్లో 5.5 పాయింట్లు సాధించడంతో పాటు ఇంటర్నేషనల్ మాస్టర్‌ టైటిల్‌కు అవసరమైన మూడో, చివరి నార్మ్‌ను పూర్తి చేసింది.

బోధన(Bodhana Sivanandan)కు ఈ టైటిల్‌ సాధించడానికి అవసరమైన మూడు నార్మ్‌లు కేవలం మూడు నెలల వ్యవధిలోనే వచ్చాయి. జులైలో ఫ్రాన్స్‌లో జరిగిన డోల్ ఓపెన్‌లో తొలి నార్మ్‌ సాధించింది. సెప్టెంబర్‌లో సమర్‌కండ్‌లో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో రెండో నార్మ్‌ అందుకుంది. బుడ్వాలో జరిగిన పోటీల్లో మూడో నార్మ్‌తో పాటు టైటిల్‌కు అవసరమైన 2400 రేటింగ్‌ మార్కును కూడా దాటింది. ఈ టోర్నీలో తొలి రౌండ్‌లో గ్రాండ్‌మాస్టర్ అలెగ్జాండ్రా గోర్యాచ్కినా చేతిలో ఓడిన బోధన, ఆ తర్వాత పుంజుకుంది. భారత క్రీడాకారిణి శ్రీ దర్శిని టి, బెలారస్‌కు చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ ఓల్గా బడెల్కాను ఓడించింది. జార్జియాకు చెందిన గ్రాండ్‌మాస్టర్ నినో బత్సియాష్విలితో డ్రా చేసుకుంది.

చివరి రౌండ్‌లో విజయంతో తన ప్రదర్శనను చారిత్రక ఘనతగా మలిచింది. ఈ విజయంతో బోధన పురుషులు, మహిళలు కలిపి అత్యంత పిన్న వయసులో ఇంటర్నేషనల్ మాస్టర్‌ టైటిల్ సాధించిన ఆటగాళ్లలో ఏడో స్థానంలో నిలిచింది. 12 ఏళ్లలోపే ఈ ఘనత సాధించిన పది మంది ఆటగాళ్లలో ఆమె ఒకరు. ఈ జాబితాలో భారత గ్రాండ్‌మాస్టర్లు ఆర్. ప్రజ్ఞానంద, డి. గుకేశ్ కూడా ఉన్నారు. గతంలోనే అతి చిన్న వయసులో మహిళా గ్రాండ్‌మాస్టర్‌ టైటిల్‌కు అవసరమైన ప్రమాణాలను పూర్తి చేసిన బోధన, ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

Also Read : ముంబై ఇండియన్స్ బాస్.. ఇక కీరన్ పొలార్డ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>