కలం, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, విజయం కోసం ఇన్నాళ్లూ జెండాలు మోసిన తమకు నిరాశే మిగిలిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్పాండే (Bhargav Deshpande) ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా తెలంగాణలో రాక్షస పాలన సాగుతోందని ఆయన విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి వైఖరి వల్లే తాము కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వస్తోందని, తెలంగాణ యువతకు అభివృద్ధి కావాలో అది అందించే నాయకుడు కేటీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. అందువల్ల యువత అంతా కలిసి భారీ సంఖ్యలో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిశ్చయించుకున్నట్లు ప్రకటించారు.
టీడీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలాలు కలిగిన నాయకులు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని భార్గవ్ దేశ్పాండే (Bhargav Deshpande) ఆరోపించారు. ఈ నాయకుల తీరు వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరుగుతుందని రాహుల్ గాంధీని హెచ్చరిస్తూ తాను కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వస్తున్నట్లు తెలిపారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినా బలహీనపడిందని వ్యాఖ్యానించారు.
రైతులకు ఇచ్చే రైతుబంధును కూడా సరిగ్గా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని, ప్రతిపక్షాలను తిట్టడం తప్ప పాలన మరియు అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, స్కామ్లపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్ రెడ్డి పాలనకు, కాంగ్రెస్ పార్టీకి స్వస్తి పలికి బీఆర్ఎస్ వైపు వెళ్లడమే సరైన నిర్ణయమని తమ యువత భావిస్తోందని పేర్కొన్నారు.
Also Read : 11 ఏళ్లకే ఇంటర్నేషనల్ మాస్టర్.. బోధన చరిత్ర!
Follow Us On: Youtube

