కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం వామనపల్లి (Vamanapally) గ్రామానికి సరఫరా అయ్యే మిషన్ భగీరథ తాగునీటి పైప్లైన్ లీకేజీ కావడం వల్ల గత పది రోజుల నుంచి నీళ్లు వృథాగా పోతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఊరు మధ్యలో రోడ్డుపై నీరు ఏరులై పారుతున్నా కూడా మిషన్ భగీరథ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని గ్రామ సర్పంచ్ పర్ణికా రెడ్డి ఆరోపించారు.
ఈ విషయమై గత 10 రోజులుగా మిషన్ భగీరథ లైన్మెన్కు సమాచారం అందిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమని సర్పంచ్ ఆరోపించారు. మిషన్ భగీరథ అధికారులకు ప్రజలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని వాపోయారు. స్వయంగా గ్రామ ప్రజాప్రతినిధి కోరినా అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి, పర్యవేక్షణ లోపానికి నిదర్శనమని అన్నారు.
ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో భవిష్యత్తులో తాగునీటి కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ అధికారులు ఇప్పటికైనా స్పందించి మరమ్మతులు చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

