కలం, మెదక్ బ్యూరో : మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్(KCR Farmhouse) పరిసర ప్రాంతాల్లో జరిగిన భూ సర్వే చుట్టుపక్కల గ్రామాల మధ్య సరిహద్దు వివాదానికి దారితీసింది. తమ గ్రామానికి సంబంధించిన సర్వే నంబర్లను తొలగించి, ఎర్రవల్లి గ్రామ సర్వే నంబర్లలో కలిపివేశారని శివారు వెంకటాపూర్ గ్రామస్తులు గతంలో ఆరోపించారు. తమ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించిన సర్వే నంబర్లు, రికార్డులు మాయమవడంపై శివారు వెంకటాపూర్ రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల సరిహద్దుల నిర్ధారణకు రెవెన్యూ అధికారులు సాధారణ నోటీసులు జారీ చేశారు. మార్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామం, శివారు వెంకటాపూర్ గ్రామాల సరిహద్దుల నిర్ధారణకు సంబంధించి జారీ చేసిన నోటీసులను మార్కూక్ తహసీల్దార్ కార్యాలయంతో పాటు శివారు వెంకటాపూర్, ఎర్రవల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులపై తహసీల్దార్ సరిత, రెవెన్యూ అధికారులు ప్రదర్శించారు. కేవలం ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లో మాత్రమే భూముల సర్వే చేశారని శివారు వెంకటాపూర్ గ్రామస్తులు పేర్కొన్నారు. తమ గ్రామ శివారులోని పలు సర్వే నంబర్లలో సర్వే నిర్వహిస్తే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు సంబంధించిన అసలు వాస్తవాలు బయటకు వస్తాయని వారు అన్నారు. వెంటనే సమగ్ర భూ సర్వే నిర్వహించి తమ గ్రామ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లోని 45 ఎకరాల భూములకు సంబంధించిన పూర్తి వివరాల విషయంలో ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల మధ్య సరిహద్దులు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో గ్రామాల సరిహద్దుల నిర్ధారణ కోసం మార్కూక్ తహసీల్దార్ సర్వేకు సంబంధించి నోటీసులు జారీ చేశారు. దీంతో ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్ గ్రామాల మధ్య ఉన్న సరిహద్దులను రీ-సర్వే చేసి, భూములకు సంబంధించిన హద్దులను పక్కాగా నిర్ధారించే అవకాశం ఉంది. ఈ సర్వే ద్వారా తమ గ్రామ భూములు పరిరక్షించబడటంతో పాటు అసలు వాస్తవాలు బయటకు వస్తాయని శివారు వెంకటాపూర్ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

