క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సబ్బినేని మేఘన

కలం, స్పోర్ట్స్: భారత మహిళా క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సబ్బినేని మేఘన (Sabbhineni Meghana) ఆటలోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. క్రికెట్ తనకు ఎన్నో నేర్పించిందని, మైదానం తన రెండో ఇల్లు లాంటిదని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎదిగిన మేఘన, 2016 నవంబరులో వెస్టిండీస్‌పై టి20 లీగ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత 2022 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై వన్డేల్లోకి అడుగుపెట్టారు. భారత్ తరఫున ఆమె 3 వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడారు. 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో వెండి పతకం సాధించిన భారత జట్టులో ఆమె కీలక సభ్యురాలిగా ఉన్నారు.

దేశవాళీ క్రికెట్‌లోనూ మేఘన విశేష ప్రతిభ చాటారు. 2021-22 మహిళల సీనియర్ వన్డే ట్రోఫీలో 388 పరుగులు చేసి అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచారు. ఆ సత్తాతోనే జాతీయ జట్టులో చోటు ఖాయం చేసుకున్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభ సీజన్ 2023లో గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడిన మేఘన, 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టులో చేరారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఆర్‌సీబీ తమ తొలి డబ్ల్యూపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న క్షణంలో ఆమె కూడా భాగస్వామి అయ్యారు.

ఆటకు విడ్కోలు చెప్పినా క్రికెట్‌తో తన అనుబంధం తెగిపోదని మేఘన వెల్లడించారు. కాబోయే తరం క్రీడాకారులకు మార్గదర్శనం చేస్తూ ఆట సేవలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన క్రీడా ప్రయాణానికి మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, కోచ్‌లకు, తోటి ఆటగాళ్లకు, బీసీసీఐ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>