పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్ పాలన: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ భవన్‌లో జరిగిన అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా గెలవలేదని, అడ్డమైన మాటలు, అబద్ధపు ప్రచారంతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంట్ లేక రైతులు తీవ్ర గోస పడుతున్నారని, తాగునీటి సమస్యతో పాటు వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని మండిపడ్డారు. పరిపాలన చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను నిండా ముంచిందని, అందుకే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఎల్ నినో ప్రభావంపై 10 నెలల ముందే హెచ్చరించినా ప్రభుత్వం ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోలేదని దుయ్యబట్టారు. పక్క రాష్ట్రాలు ప్రాజెక్టులను నింపుకుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం పంపులు ప్రారంభించి నీటిని నింపితే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే కుట్రతో వదిలేశారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులే మేడిగడ్డను కూల్చి, రాహుల్ గాంధీని తీసుకొచ్చి అబద్ధాలు చెప్పించారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి దున్నపోతు ఈనిందంటే కిషన్ రెడ్డి దూడను కట్టేస్తానన్నట్లు కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కేసీఆర్‌పై విమర్శలు చేసే విషయంలో ఒక్కటవుతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పిచ్చోడి చేతిలో రాయిలా పాలన సాగుతోందని, మరో ఏడాది మాత్రమే రేవంత్ రెడ్డి హడావుడి ఉంటుందని, ఆ తర్వాత మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికలు పెట్టే ధైర్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ సెంచరీ కొట్టి స్థానిక సంస్థలను గెలుచుకుంటుందని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో (Graduate MLC Elections) యువత, విద్యార్థులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటర్లు తగిన బుద్ధి చెబుతారని, రానున్న రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు.

Also Read : పొరుగు రాష్ట్రాల పోలీసులతో సమిష్టి పోరుకు సీఎం రేవంత్ పిలుపు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>