కరీంనగర్ బల్దియాలో విలీన గ్రామాల ప్రజల అవస్థలు!

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ నగర పాలక సంస్థ (Karimnagar Municipal Corporation) పరిధి విస్తరణతో తమ సమస్యలు తీరుతాయని, సేవలు వేగవంతంగా అందుతాయని భావించిన విలీన గ్రామాల ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. పంచాయతీల నుంచి మున్సిపాలిటీ పరిధిలోకి చేరిన ఆరేపల్లి, సీతారాంపూర్, రేకుర్తి, అలుగునూర్, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, పద్మానగర్, దుర్షేడ్, కొత్తపల్లి, చింతకుంట, మల్కాపూర్, బొమ్మకల్ తదితర గ్రామాల ప్రజలకు జనన, మరణ ధృవీకరణ పత్రాల మంజూరు ఒక పెద్ద ప్రహసనంగా మారింది.

​నిర్లక్ష్యం అధికారులది.. శిక్ష ప్రజలకా?

​గ్రామాలు నగరపాలక సంస్థలో విలీనమైన సమయంలోనే, నాటి పంచాయతీ రికార్డులన్నింటినీ ఆధీనంలోకి తీసుకుని నగరపాలక సంస్థ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ, నాటి నుంచి నేటి వరకు ఆ రికార్డులను డిజిటలైజ్ చేయడంలో అధికారులు చూపిన తీవ్ర నిర్లక్ష్యం ఇప్పుడు విలీన గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. ​ప్రజలు మీ-సేవ కేంద్రాల్లో జనన, మరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటే ‘రికార్డులు ఆన్‌లైన్‌లో లేవు’ అని వస్తుండటంతో బల్దియా ఆఫీసు చుట్టూ తిరగాల్సి వస్తోంది. కార్యాలయానికి వెళ్తే ఉచితంగా లేదా సులభంగా పరిష్కరించాల్సిన అధికారులు.. ఆర్‌డీఓ కార్యాలయం ద్వారా పత్రాలు తెచ్చుకోవాలంటూ సాకులు చెప్తూ తిప్పుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు.

సాంకేతికత పేరుతో అక్రమ దందా?

​పరిపాలనను సులభతరం చేసేందుకు తీసుకొచ్చిన ఆన్‌లైన్ విధానం, ఇక్కడ కొందరు అధికారుల అక్రమార్జనకు మార్గంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల పేరుతో ఇబ్బందులు సృష్టిస్తూ, దొడ్డిదారిన వచ్చే దరఖాస్తులకు, ‘ముడుపులు’ ముడితేనే పని జరుగుతుందనే వాతావరణాన్ని కల్పిస్తున్నారని విలీన గ్రామాల నివాసులు ఆరోపిస్తున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి

పంచాయతీ రికార్డులను పరిశీలించి వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసే అవకాశం ఉన్నప్పటికీ, అధికారులు పట్టించుకోకపోవడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విలీన గ్రామాల ప్రజల అవస్థలను గుర్తించి, బల్దియా ఉన్నతాధికారులు, పాలకవర్గం వెంటనే స్పందించాలని, పాత రికార్డులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన ఆన్‌లైన్ చేయించి, ధృవీకరణ పత్రాల మంజూరు వేగవంతం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>