కలం, తెలంగాణ బ్యూరో : రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ (BRS Graduate MLC) స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించనున్నది. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ ఈ అంశంపై చర్చలు జరిపి కొందరి పేర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోసారి పరిశీలించి తుది పేర్లను ఖరారు చేసి ప్రకటిస్తారని వెల్లడించాయి. రెండింటిలో ఒక స్థానాన్ని బీసీ సామాజికవర్గానికి, మరొకటి రెడ్డి సామాజికవర్గానికి కేటాయించే అవకాశముంది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో బీసీ అభ్యర్థిని, నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గానికి రెడ్డి అభ్యర్థిని ఖరారు చేసే చాన్స్ ఉంది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో ఇప్పటికే రాకేశ్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన ఆయన, ఈసారి విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారు. వాస్తవానికి ఈ రెండూ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే. పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ మద్దతుతో తీన్మార్ మల్లన్న గెలిచారు. ఈసారి మాత్రం రెండు స్థానాలను కైవసం చేసుకుంటామని బీఆర్ఎస్ ధీమాగా ఉంది.
అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ చార్జ్ లు ఫైనల్
ఇద్దరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోడానికి అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా ఇన్చార్జ్ లను బీఆర్ఎస్ నియమించింది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని పెట్టింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నవీన్‌ను కొడంగల్‌లో బీఆర్ఎస్ ఇన్చార్జ్ గా నియమించడం గమనార్హం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీఎం స్థానంలోనే పైచేయి సాధించాలన్నది బీఆర్ఎస్ ఆలోచన. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ పరిధిలో 43 మందిని, నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పరిధిలో 34 మందిని ఇన్చార్జి లుగా నియమించింది.
ఈ రెండు చోట్లా గులాబీ అభ్యర్థులే గెలుపొందాలన్న లక్ష్యంతో తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఇన్చార్జిలపై పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. గ్రాడ్యుయేట్లను గుర్తించి వారిని ఓటర్లుగా పేర్లను నమోదు చేయించడం మొదలు పోలింగ్ రోజున వారితో ఓటు వేయించడం వరకు ఇన్‌ఛార్జులు యాక్టివ్‌గా పనిచేయాలని, రాష్ట్రంలో దాదాపు సగంకంటే ఎక్కువ ప్రాంతం ఎన్నికల్లో పాల్గొంటున్నందున ఇది రాబోయే ఎన్నికలకు ప్రారంభ సూచకంగా ఉండాలన్నది కేటీఆర్ ఆలోచన.
సీఎం సమగ్ర సమీక్షకు ముందు రోజే ప్రకటన
ఈ రెండు స్థానాలకు బీజేపీ, బీఆర్ఎస్కంటే ముందే కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. రెండింటినీ ‘రెడ్డి’ సామాజికవర్గానికే కేటాయించింది. ఆ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ రెండు నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లతో శుక్రవారం సమీక్ష నిర్వహించబోతున్నారు. రెండు సెషన్లుగా జరిగే ఈ సమావేశాల్లో వారికి సీఎం, పీసీసీ చీఫ్ దిశానిర్దేశం చేయడంతో పాటు పక్కా వ్యూహాన్ని వివరించనున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండూ గెలవాల్సిందేనన్న పట్టుదలతో ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పజెప్పారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జ్ ల నియామకం కూడా పూర్తయింది. ఈ రివ్యూ జరగడానికి ఒక రోజు ముందు ఇన్చార్జిలను ప్రకటిస్తూ బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. త్వరలో బీజేపీ సైతం రెండు చోట్లా అభ్యర్థులను ప్రకటించనున్నది. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటివారంలో పోలింగ్ జరగనున్నది. దాదాపు 5 నెలల పాటు మూడు పార్టీల ముమ్మరం ప్రచారం జరగనున్నది.

