కలం, వెబ్ డెస్క్ : నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలో వాతావరణం వేగంగా మారుతోంది. దీనికి తోడు బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నూతన ఉపరితల ఆవర్తనం క్రమంగా పశ్చిమ-వాయువ్య దిశగా పయనిస్తూ మరింత బలపడి, రానున్న రోజుల్లో వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ వాతావరణ పరిస్థితుల కారణముగా రాగల రెండు రోజుల పాటు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమతో పాటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు (AP Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అయితే ఈ సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో, తీర ప్రాంత ప్రజలు, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల నివాసితులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది.

