కలం, ఆదిలాబాద్: రాబోయే రోజుల్లో ఎల్ నినో ప్రభావం (El Nino Impact)తో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) పిలుపునిచ్చారు. గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ వీసీ హాల్ నుండి ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, కార్యాచరణపై గూగుల్ మీట్ ద్వారా ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఎల్ నినో పరిస్థితులను అధిగమించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొని ఉండగా, సాధారణ వర్షపాతం కంటే 35 శాతం లోటు నమోదైందని వెల్లడించారు. ఏ మండలాల్లో కరువు ప్రకటించాలనే దానిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికలు పంపించామని, కేబినెట్ తీసుకునే నిర్ణయం ఆధారంగా తగిన సహాయక చర్యలు అమలవుతాయని తెలిపారు.
కరువు సమయంలో మనుషులు గానీ, పశువులు గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలు కోల్పోకూడదని, ప్రాణనష్టం జరగకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని ఉద్ఘాటించారు. రైతులు తీవ్ర ఇబ్బందులతో తీవ్ర నిర్ణయాలు వైపు వెళ్లకుండా సర్పంచులు, అధికారులు వారిని అప్రమత్తం చేసి తగిన కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. అప్పుల భారంతో లేదా అనారోగ్యంతో బాధపడుతున్న రైతులకు భరోసా కల్పించి, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తగిన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.
పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలే అవశేషాలను రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చవద్దని స్పష్టం చేశారు. ఈ అవశేషాలను నేలలో కలిపి మల్చింగ్ చేయడం వల్ల నేలలో తేమ శాతం పెరిగి, తద్వారా శనగ, మినుములు, నువ్వులు తదితర పంటల దిగుబడి బాగా రావడానికి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. అంతేకాకుండా పశువుల మేత కోసం సైతం వీటిని సద్వినియోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి పంట అవశేషాలకు నిప్పు పెడితే గ్రామ పంచాయతీల ద్వారా జరిమానా విధించేలా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తాగునీటి సరఫరాలో మిషన్ భగీరథ లీకేజీలను గుర్తించి తక్షణమే సరిచేయాలని, ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించే ప్రాంతాలను ముందుగా గురించి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మారుమూల ఆవాసాలు, గుట్ట ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో కనీసం 60 నుంచి 70 మంది కూలీలతో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని తెలిపారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు అందుబాటులో లేని చోట సీనియర్ మేట్లను నియమించి ఉపాధి కల్పించాలని, రికార్డులను ఎక్కడా ఆలస్యం చేయకుండా ఎంబీ రికార్డు, ఈసీ ప్రక్రియలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు. సాత్నాల, మత్తడి వాగు, బజార్హత్నూర్ తదితర ప్రాంతాల్లోని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. నీటి సంరక్షణలో భాగంగా ప్రతి గ్రామంలో ఉన్న ఆర్వో ప్లాంట్ల దగ్గర వృథాగా పోయే నీటిని అరికట్టేందుకు బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్లు లేదా ఇంకుడు గుంతలు నిర్మించాలని స్పష్టం చేశారు.
ఇష్టానుసారంగా మోటార్లు ఆన్ చేసి నీటిని వృథా చేయకుండా, అవసరమైన మేరకే విద్యుత్, నీటిని వినియోగించుకోవాలని సూచించారు. బోథ్, ఇచ్చోడ, ఉట్నూర్ వంటి మండలాల్లో పీఎం సూర్యఘర్ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటే పూర్తి ఫైనాన్సింగ్‌తో పాటు సబ్సిడీ సైతం వస్తుందని, దీని ద్వారా విద్యుత్ ఆదా చేసుకోవచ్చని తెలిపారు.
Also Read : తెలంగాణలో మోదీ, అమిత్ షా పర్యటనలు ఖరారు!
Follow Us On: Youtube

