కలం, స్పోర్ట్స్: ఆసియా పారా గేమ్స్ 2026 (Asian Para Games 2026) లో భారత అథ్లెట్లు తమ పతకాల జోరును కొనసాగిస్తున్నారు. గురువారం జరిగిన పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టైల్ S10 స్విమ్మింగ్ ఫైనల్లో భారత ఈతగాడు కపిల్ కుమార్ (Kapil Kumar) అద్భుత ప్రదర్శన చేసి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. 4 నిమిషాల 38.44 సెకన్లలో రేసును పూర్తి చేసి ఆయన రెండో స్థానంలో నిలిచారు. ఐదుగురు పోటీపడిన ఈ ఫైనల్ పోరులో కపిల్ ఆరంభం నుంచే స్థిరమైన ప్రదర్శన కనబరిచారు.
జపాన్‌కు చెందిన అకితో మినాయ్ 4:27.44 సమయంతో గేమ్స్ రికార్డు నమోదు చేస్తూ స్వర్ణం గెలుచుకోగా, ఇరాన్ అథ్లెట్ షాహిన్ ఇజాద్యార్‌ను వెనక్కి నెట్టి కపిల్ (Kapil Kumar) వెండి పతకాన్ని ముద్దాడారు. ఈ రేసుతో ఈ పోటీల్లో కపిల్ ప్రయాణం ముగిసింది. ఇక పారా స్విమ్మింగ్‌లో వికలాంగత్వ శాతాన్ని బట్టి వర్గీకరణలు ఉంటాయి. S10 వర్గాన్ని స్వల్ప శారీరక వైకల్యం ఉన్న అథ్లెట్లకు కేటాయిస్తారు. ఈ పోటీలలో ఉచిత శైలి, బ్యాక్‌స్ట్రోక్, బటర్‌ఫ్లై విభాగాలకు S అని, బ్రెస్ట్‌స్ట్రోక్‌కు SB అని, ఇండివిజువల్ మెడ్లేకు SM అని పేర్లు ఉపయోగిస్తారు.
మిగతా క్రీడల్లోనూ భారత్‌కు మంచి ఫలితాలు దక్కాయి. పారా టేబుల్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ XD7 విభాగంలో భవినా పటేల్ – సుభమ్ వధ్వా జోడీ కాంస్యం సాధించింది. పారా బ్యాడ్మింటన్ మహిళల SU5 సెమీస్‌లో మనీషా రామదాస్‌ను ఓడించి తులసిమతి మురుగేశన్ ఫైనల్ చేరగా, మనీషా కాంస్యంతో సరిపెట్టుకుంది. అలాగే ఆర్చరీలో శీతల్ దేవి కాంపౌండ్ మిక్స్డ్ టీమ్, ఇండివిజువల్ విభాగాల్లో స్వర్ణాలు గెలిచి డబుల్ విజయాన్ని అందుకుంది.
Also Read : ఒకే రోజు రెండు గోల్డ్స్.. శీతల్ అదుర్స్!
Follow Us On: Youtube

