కలం, నిజామాబాద్ బ్యూరో : ఎల్ నినో ప్రభావాన్ని (El Nino Effect) సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా.. రానున్న రోజుల్లో తాగునీరు, విద్యుత్ అవసరాలకు సంబంధించి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) సూచించారు. యాసంగి సీజన్లో వరి సాగు చేయకుండా క్షేత్రస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
సంప్రదాయంగా వస్తున్న వరి పంటకు బదులుగా నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తూ రానున్న రోజుల్లో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా అధిగమించాలని సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లో గురువారం ఎల్ నినో ప్రభావం నేపధ్యంలో చేపట్టాల్సిన చర్యల విషయమై కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, వారికి దిశానిర్దేశం చేశారు.
ఎల్ నినో ప్రభావం (El Nino Effect) అంతకంతకు తీవ్రరూపం దాలుస్తున్న దృష్ట్యా, రానున్న పరిస్థితులను ముందుగానే అంచనా వేసి తగిన ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యాసంగిలో వరి సాగుకు నీటి సరఫరా అందుబాటులో ఉండే అవకాశం లేనందున వరి సాగు చేయవద్దని గ్రామగ్రామాన రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అన్నారు.
తక్కువ నీటితో, స్వల్ప వ్యవధిలో దిగుబడులు అందించే ప్రత్యామ్నాయ పంటల గురించి రైతులకు తెలియజేయాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ పామ్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించేలా చూడాలన్నారు. గ్రామస్థాయిలో రైతులతో సమావేశాలు నిర్వహించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూగర్భ జలాల పరిస్థితి వివరించాలని తెలిపారు.
రైతులు నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా వరి విత్తుకుంటే నష్టపోయే ప్రమాదం ఉన్నందున ముందస్తుగానే వారికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, ఆర్డీఓలు రాజేంద్రకుమార్, విజయ కుమారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Also Read : ఆసియా పారా గేమ్స్‌లో కపిల్ కుమార్‌కు రజతం
Follow Us On : WhatsApp

