కలం, కరీంనగర్ బ్యూరో: ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లా కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు నవంబరు రెండో వారంలో భర్తీ కానున్న గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానం చుట్టూనే తిరుగుతోంది. రేసులో పలువురు సీనియర్ నేతల పేర్లు వినిపిస్తున్నప్పటికీ, అధిష్టానం ఆలోచనలు, సామాజిక సమీకరణాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్గత వ్యూహాలను పరిశీలిస్తే.. ఈ ప్రతిష్టాత్మక ‘గవర్నర్ కోటా’ ఎమ్మెల్సీ పదవి కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశంకే (Sattu Mallesham ) దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
బీసీ కార్డు.. సీఎం సెంటిమెంట్
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం సామాజిక న్యాయానికే మొదటి పీట వేస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ముగ్గురు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీ ఓటు బ్యాంకును బలోపేతం చేయాలంటే బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేయడమే ఏకైక మార్గమని పార్టీ భావిస్తోంది.
ఇటీవల సిరిసిల్ల పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బీసీలకు, పద్మశాలీలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చిన స్పష్టమైన హామీ సత్తు మల్లేశం అభ్యర్థిత్వానికి మరింత బలాన్ని చేకూర్చింది. బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన మల్లేశం వైపే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి మొగ్గు చూపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో గట్టి ప్రచారం జరుగుతోంది.
పోటీలో ఉన్నా.. ‘మల్లేశం’ ముందే
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ (ఎస్సీ మాదిగ కోటా), ప్రోటోకాల్ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్ (బ్రాహ్మణ కోటా) లతో పాటు పలువురు నేతలు తమ సొంత లాబీయింగ్‌ను ముమ్మరం చేసినప్పటికీ.. ప్రస్తుత రాజకీయ సమీకరణాల్లో సత్తు మల్లేశం అందరికంటే ముందు వరుసలో నిలిచారు. సత్తు మల్లేశం వద్ద ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, క్షేత్రస్థాయిలో పార్టీకి అందించిన సేవలు, అన్నింటికీ మించి సీఎం రేవంత్ రెడ్డికి ఆయనపై ఉన్న అపరిమితమైన నమ్మకమే ఆయనను ఎమ్మెల్సీ రేసులో తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి.
జిల్లా మంత్రుల ఆమోదం.. తిరుగులేని బలం
ఈ నామినేటెడ్ పదవి భర్తీలో జిల్లా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌ల పాత్ర కీలకం కాగా, వీరిద్దరూ కూడా మల్లేశం అభ్యర్థిత్వం వైపే సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, తదుపరి సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీసీ సమీకరణాల ఆధారంగా మల్లేశంను మండలికి పంపడమే సరైన నిర్ణయమని మంత్రులు కూడా భావిస్తున్నారు.
మరో 15 నుండి 20 రోజుల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రానుండగా అధిష్టానం విడుదల చేసే తుది జాబితాలో సత్తు మల్లేశం పేరు మొదటి వరసలోనే ఉండబోతోందని జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ‘గవర్నర్ కోటా’ నామినేటెడ్ ఎమ్మెల్సీగా సత్తు మల్లేశం పేరు ఖరారవ్వడమే ఇక మిగిలి ఉందని పార్టీ వర్గాల నుంచి స్పష్టమైన సమాచారం గా తెలుస్తోంది.

