కలం, వెబ్ డెస్క్: కడప జిల్లాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నందలూరు (Nandalur)లో నామినేషన్ల దాఖలు సందర్భంగా టీడీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మేడా విజయశేఖర్ రెడ్డి వర్గానికి చెందిన అభ్యర్థి నామిననేషన్ వేసేందుకు రాగా.. ఆయన ప్రత్యర్థి వర్గం అడ్డుకుంది. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది. విజయశేఖర్ రెడ్డి కారును తగలబెట్టారు. రెండు వర్గాలు రాళ్లు, కర్రలతో కొట్టుకోవడంతో పాటు కుర్చీలు విసురుకున్నారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి గాల్లోకి కాల్పులు జరపడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాల్పుల అంశంపై దర్యాప్తు చేపట్టారు. ఇరు వర్గాల ఘర్షణలో రెండు కార్లు, ఒక బైక్ పూర్తిగా దగ్ధమయ్యాయి.
జోరుగా సాగుతున్న నామినేషన్లు..
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముమ్మరంగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బుధవారం 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 409 నామినేషన్లు, 9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను 5,267 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గురువారం కూడా అదే స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.

