కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజగోపాల్ రావు ఆధ్వర్యంలో గురువారం మోతాజ్ ఖానా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో కుష్టు వ్యాధి గుర్తింపు ప్రచార (Leprosy Detection Campaign) కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజగోపాల్ రావు మాట్లాడుతూ.. ప్రజల్లో కుష్టు వ్యాధిపై సరైన అవగాహన కల్పించడం, వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి అనుమానితులకు తక్షణమే తగిన ఉచిత వైద్య చికిత్స అందించడమే ఈ ప్రచార కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు.
ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం (Leprosy Detection Campaign) అక్టోబర్ 22 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు (14 రోజుల పాటు) జిల్లా వ్యాప్తంగా నిర్వహించ బడుతుందని పేర్కొన్నారు. ఈ 14 రోజుల పాటు ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు కుష్టు వ్యాధి లక్షణాలపై అవగాహన కల్పిస్తారని, వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి అవసరమైన వైద్య పరీక్షల నిమిత్తం రీఫర్ చేస్తారని వివరించారు.
కుష్టు వ్యాధి ప్రాథమిక దశలోనే గుర్తించి పూర్తిస్థాయి చికిత్స తీసుకోవడం ద్వారా శారీరక వైకల్యాలను పూర్తిగా నివారించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఈ వ్యాధి పట్ల సమాజంలో ఉన్న అపోహలు, వివక్షను విడనాడాలని, శరీరంపై స్పర్శ లేని మచ్చలు లేదా ఇతర అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ ఇమ్రాన్ ఖాన్, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read : రాహుల్ గాంధీ విదేశీ పర్యటనపై అమిత్ షా సెటైర్లు
Follow Us On: Youtube

