కలం, వనపర్తి: అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వ బీమా, పెన్షన్ పథకాలను ( Insurance Schemes) సద్వినియోగం చేసుకుని ఆర్థిక భద్రత పొందాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Collector Adarsh Surabhi) సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో గురువారం వనపర్తి మండలం నాచహల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక సమ్మిళిత పథకాలపై అవగాహన శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై పలు ప్రభుత్వ పథకాల ప్రాధాన్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలు ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ఏడాదికి రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల ప్రమాద బీమా రక్షణ పొందవచ్చని వివరించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో ఏడాదికి రూ.436 ప్రీమియంతో, నిబంధనలకు అనుగుణంగా మరణ బీమా కింద రూ.2 లక్షల ప్రయోజనం పొందవచ్చని పేర్కొన్నారు.
అటల్ పెన్షన్ యోజన ద్వారా అర్హతలు, నిబంధనలకు అనుగుణంగా క్రమం తప్పకుండా పొదుపు చేస్తే వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత పొందవచ్చని తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకాల్లో చేరని అర్హులు సమీప బ్యాంకులను సంప్రదించి నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ, పిన్ వంటి రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని కలెక్టర్ హెచ్చరించారు. బ్యాంకింగ్ సేవలపై అవగాహన పెంచుకోవడంతో పాటు పొదుపు అలవాటును పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
శిబిరంలో యూనియన్ బ్యాంక్ సిబ్బంది వివిధ బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఐ ఏజీఎం ప్రదీప్ చంద్ర, నాబార్డ్ డీడీఎం మనోహర్ రెడ్డి, ఎల్డీఎం శివకుమార్, డీఎల్పీవో రఘునాథ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ అబ్దుల్లా, అధికారులు, బ్యాంకు ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

