కలం, నకిరేకల్: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) తెలిపారు. నకిరేకల్ పట్టణ సమీపంలోని కడపర్తి (Kadaparthy) రోడ్డులో సుమారు రూ.200 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడిన వేముల పలు కీలక సూచనలు చేశారు. పాఠశాల భవనాల నిర్మాణంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కఠినమైన నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆదేశించారు. పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే వీరేశం (Vemula Veeresham) పేర్కొన్నారు. ఈ సమగ్ర గురుకుల పాఠశాల ప్రాంగణం అందుబాటులోకి వస్తే నకిరేకల్ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : బీఆర్ఎస్‌తో టచ్‌లో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం : ఎంపీ అరవింద్
Follow Us On : WhatsApp

