కలం, నిజామాబాద్ బ్యూరో : పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వీరుడు, తెలంగాణ గడ్డపై ప్రజా తిరుగుబాటుకు స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు పండుగ సాయన్న (Panduga Sayanna) అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (TPCC President Mahesh Kumar Goud) అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించిన పండుగ సాయన్న జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని, సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నిజాం పాలనలో దొరలు, జమీందారుల దోపిడీకి వ్యతిరేకంగా పండుగ సాయన్న సాగించిన పోరాటం అణగారిన వర్గాల్లో ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని నింపిందని పేర్కొన్నారు. సామాజిక అసమానతలు, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలిచిన ఆయన సాహసం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
పండుగ సాయన్న జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, పేదలు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ చైర్మన్ తాహెర్, రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

