కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో పోలీస్ (Khammam Police) అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని బుధవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను ఈ సందర్భంగా అధికారులు స్మరించుకుని ఘన నివాళులర్పించారు.
ఖమ్మం పోలీస్ హెడ్క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన స్మృతి పరేడ్‌లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్ పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. రెండు నిమిషాలు మౌనం పాటించి వీరమరణం పొందిన పోలీసులకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలకు తెగించి చేస్తున్న సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌లో వినియోగిస్తున్నామని తెలిపారు. ఇదే వేదికపై ఇంటి స్థలాల సమస్యను ప్రస్తావించిన నలుగురు పోలీసు సిబ్బందికి కలెక్టర్ వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించి ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించారు.
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్ఛాలు సమర్పించి నివాళులర్పించారు. సాయుధ పోలీసులు ‘శోక్ శస్త్ర’ నిర్వహించి అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికులతో పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన 10 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్ల స్మారకార్థం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.
2025 సెప్టెంబర్ 1 నుండి 2026 ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 154 మంది పోలీస్ సిబ్బందిని (వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు ఉన్నారు) ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు, భద్రాచలం డిఎస్పీలు, ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పెద్దఎత్తున పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.

