కలం, కరీంనగర్ బ్యూరో: భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 3వ వేతన సవరణను(BSNL Pay Revision) తక్షణమే ఆమోదించి అమలు చేయాలని కోరుతూ ‘ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ ఆఫ్ బీఎస్ఎన్ఎల్’ ప్రతినిధి బృందం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌కు కరీంనగర్లో వినతిపత్రం సమర్పించింది. 01 జనవరి 2017 నుంచి అమలు కావాల్సిన వేతన సవరణను ‘అఫర్డబిలిటీ క్లాజ్’ (లాభాల నిబంధన) సాకుతో నిలిపివేయడం సరికాదని AUAB నాయకులు పేర్కొన్నారు. డెప్యుటేషన్ అధికారులకు వేతన సవరణ ఇస్తూ, సంస్థ సొంత ఉద్యోగులను విస్మరించడం వల్ల వారి నైతిక స్థైర్యం దెబ్బతింటోందని తెలిపారు.
వేతన సవరణకు సంబంధించిన ఫైల్‌ను బిఎస్ఎన్ఎల్ యాజమాన్యం ఈ ఏడాది ఫిబ్రవరి 24నే టెలికాం శాఖకు (డీవోటీ) పంపినప్పటికీ, క్యాబినెట్ ఆమోదం పొందడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వినతిపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్.. బిఎస్ఎన్ఎల్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి పూర్తి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి తీసుకెళ్లి సమస్య త్వరితగతిన పరిష్కారమయ్యేలా చొరవ చూపుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో AUAB ప్రతినిధులు బండారి సంతోష్ కుమార్ (SNEA), ఎస్. సత్తయ్య (BSNLEU), జి. కిషన్ (SEWA), సిహెచ్. లింగాచారి (NFTE), ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

