కలం, నాగర్ కర్నూల్: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మొదటిదైన నార్లాపూర్ రిజర్వాయర్ (Narlapur Reservoir) నుంచి కల్వకుర్తి ప్రాజెక్టులోని ఎల్లూరు రిజర్వాయర్ లోకి నీటి విడుదలలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) విమర్శించారు. బుధవారం మంత్రి నార్లాపూర్ రిజర్వాయర్ నుండి ఎల్లూరు రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
నార్లాపూర్ నుంచి ఏదుల వరకు కాలువల తవ్వకం, బ్రిడ్జిల నిర్మాణం, మూడు చోట్ల తండు తవ్వకాలు ఇంకా పూర్తికాలేదని, కొన్ని చోట్ల రాతి నేల ఉండటంతో పనులు ఆలస్యమవుతున్నాయని మంత్రి తెలిపారు. పనులు పూర్తికాకుండా నీటిని విడుదల చేస్తే నీరు మధ్యలోనే నిలిచిపోతుందని అన్నారు. ఇది తెలియకుండా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం వారి ఇంగిత జ్ఞానం లేకపోవడాన్ని చూపిస్తుందని విమర్శించారు.
మూడో ప్యాకేజీలో పెండింగ్ పనులను గత ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులను వేగంగా పూర్తి చేస్తోందని జూపల్లి వివరించారు. మరో మూడు నెలల్లో కాలువల పనులు పూర్తి చేసి రైతులకు సంపూర్ణంగా నీరు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, గాలి మాటలు మాని వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి జూపల్లి (Jupally Krishna Rao) కౌంటర్ ఇచ్చారు.
ఈ నీటి విడుదలతో మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పరిధిలోని కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి నియోజకవర్గాల్లో అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటి సదుపాయం కలగనుంది అన్నారు. అంతేకాకుండా మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.
Also Read : ‘మీరు జెన్-జీ కాదు’.. సీజేపీ నేతలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Follow Us On: Youtube

