పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: పొంగులేటి

కలం, ఖమ్మం బ్యూరో :  ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ఫలాలను అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti) అన్నారు. మంగళవారం ఇల్లందు(Yellandu) నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి, పూర్తయిన పనులను మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఇల్లందులో ఒక కోటి 49 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం జేకే కాలనీలో 4 కోట్ల 21 లక్షల వ్యయంతో నిర్మించిన మినీ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన జిమ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ కోర్టు తదితర క్రీడా సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే క్రీడాకారులతో కలిసి జిమ్, వాలీబాల్, షటిల్, క్యారమ్స్ ఆడుతూ వారిలో ఉత్సాహాన్ని నింపారు.

అనంతరం ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డులో ఒక కోటి 43 లక్షల వ్యయంతో నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను బటన్ నొక్కి ప్రారంభించారు. మేడికుంట–రామచంద్రపురం రహదారిపై రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జిని ప్రారంభించారు. తిలక్‌నగర్‌లో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన ఎనిమిది ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. మసివాగుపై 6 కోట్లతో నిర్మించిన హైలెవల్ బ్రిడ్జికి మూడు నెలల క్రితం శంకుస్థాపన చేసి, పనులు పూర్తి చేసిన అనంతరం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, మరోవైపు పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇప్పటికే రెండు విడతల్లో ఇళ్లను మంజూరు చేశామని, మరో రెండు విడతల్లో అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఇల్లందు నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని తెలిపారు.

దసరా పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గృహ నిర్మాణశాఖ అధికారి సావేరామ్, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ సందీప్, తహసీల్దార్ ఖాసీం, ఎంపీడీవో ధన్ సింగ్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>