కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్ ఎస్సీ కాలనీలో (Budhwarpet SC Colony) దొంగలు ఓ ఇంట్లో చోరీకి (House Theft) పాల్పడ్డారు. ఇంటి కిటికీలోంచి లోపలికి చొరబడిన గుర్తుతెలియని దుండగుడు బీరువాలో ఉన్న తులం బంగారం, రూ.50 వేల నగదును అపహరించాడు.
బాధితుడు షేక్ మహిముద్ కథనం ప్రకారం.. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఓ శుభకార్యానికి వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని ఇంటికి చేరుకున్న వారు రాత్రి నిద్రపోయారు. మంగళవారం ఉదయం లేచి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించారు. బీరువాలో పరిశీలించగా తులం బంగారం, రూ.50 వేల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

