డిసెంబర్ 9న వెలుగుమట్ల కాలనీ ప్రారంభం

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల (Velugumatla) కాలనీలో అద్భుతమైన వసతులతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపడుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. ​సోమవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి వెలుగుమట్ల కాలనీని పరిశీలించారు.

అక్టోబర్ నెలాఖరులోగా..

అనంతరం మీడియా సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. అక్టోబర్ నెలాఖరులోగా అన్ని ఇళ్ల స్లాబుల నిర్మాణం, విద్యుత్ పనులు పూర్తి కావాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించి పగలు, రాత్రి పనులు కొనసాగించాలని సూచించారు. దీపావళి నాటికి (నవంబర్ 8) కాలనీలోని ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్‌టాప్ ప్యానెళ్ల ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు రహదారులు, డ్రైనేజీలు, షాపింగ్ కాంప్లెక్స్, బస్తీ దవాఖానా, కమ్యూనిటీ హాల్, అంగన్‌వాడీ కేంద్రం వంటి అన్ని మౌళిక వసతులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి మూడు రోజులకు ఒకసారి కలెక్టర్‌కు నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.

ఆదర్శంగా కాలనీ..

​గతంలో పేదల పేరుతో భూములు ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారి నుంచి కోర్టు ఆదేశాల మేరకు భూములు స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. మోసపోయిన అర్హులైన పేదలకు శాశ్వత నివాసాలు కల్పిస్తున్నామని తెలిపారు. కోట్లాది రూపాయల విలువైన వసతులతో వెలుగుమట్ల కాలనీని ఆదర్శవంతంగా మారుస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ ఛైర్మన్ హన్మంతరావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>