కలం, నాగర్ కర్నూల్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె (NHM Employees Strike) సోమవారం ఏడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఎం ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో ఉద్యోగులు మెడలో ఉరి తాళ్లు వేసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.
ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు, పొరుగు సేవల విధానాల్లో పనిచేస్తూ ప్రజలకు వైద్య సేవలందిస్తున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ గోడు పట్టించుకుని న్యాయం చేయాలని, ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి తక్షణమే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఎన్హెచ్ఎం పరిధిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించాలని జేఏసీ నాయకులు కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులందరికీ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) వర్తింపజేయడంతోపాటు వార్షిక వేతన పెంపులు, విధేయతకు ప్రోత్సాహక బోనస్, 180 రోజుల ప్రసూతి సెలవులు కల్పించాలని కోరారు.
ప్రజారోగ్య పరిరక్షణలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించి, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఏళ్ల తరబడి సేవలందిస్తున్నప్పటికీ తమకు తగిన గుర్తింపు, భద్రత లభించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాల భవిష్యత్తుపై ఆందోళన నెలకొందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి తమ సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఎం జేఏసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌస్ పాషా, కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీనివాసులు, కోశాధికారి ప్రవీణ్, జేఏసీ సభ్యులు డాక్టర్, జగన్, రామకృష్ణరెడ్డి, సురేష్, భీముడు తదితరులు పాల్గొన్నారు.

