కలం, అచ్చంపేట: నాగర్ కర్నూల్ (Nagarkurnool) జిల్లా పదర మండలం వంకేశ్వరం (Vankeswaram) గ్రామంలో 12వ శతాబ్దం నాటి పురాతన శిలాశాసనం వెలుగులోకి వచ్చింది. అదే గ్రామానికి చెందిన ముత్యాలమ్మ కాలనీ వాసులైన రాజగిరి వెంకటేష్ ఈ శాసనాన్ని ఓ ఇంటి గడప ముందు ఉండగా గుర్తించారు. ఈ శాసనం 11నుండి 14వ శతాబ్దం వరకు అప్పట్లో అమరేశ్వరంగా పిలువబడే నేటి అమ్రాబాద్ పీఠభూమి పరిపాలించిన కందూరు చోడుల కాలంలో వేయించిన దాన శాసనంగా పురాణాల ద్వారా తెలుస్తోంది.
దీనిపై రాజిగిరి వెంకటేష్ క్షేత్ర స్థాయిలో అవగాహన చేసుకుని 12వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కందూరు చోడ రాజు నలభీమ దేవరాజు పట్టపు రాణి వెన్నమదేవి తన భర్తకు పుణ్యం కలగాలని స్థానిక శివాలయానికి నిత్య ధూప దీప నైవేద్యాల కోసం భూదానం చేసినట్లుగా ఈ శాసనం ద్వారా తెలిసిందన్నారు.
ఈ శాసన ప్రతిమలో ఉన్నటువంటి శివలింగం స్థానిక శివాలయాన్ని సూచిస్తుందని పైన కనబడుతున్న సూర్యుడు, చంద్రుడు సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచంద్రతారార్కం ఈ శాసనం వర్ధిల్లుతుందని ఆ పరమ శివుని సాక్షిగా చెబుతుందని వివరించారు. ఇలాంటి శాసనాలు నల్లమల ప్రాంతంలోని అనేక శివాలయాల్లో ఉన్నాయని అన్నారు.
చారిత్రక సంపదను కాపాడుకోవాలని, ఎవరికైనా అక్షరాలు ఉన్న రాళ్ళు, ఆకారాలు ఉంటే తెలియజేయాలని కోరారు. సుమారు 800 వందల సంవత్సరాల క్రితం గ్రామ (Vankeswaram) చరిత్రకు సంబంధించిన శాసనంను గుర్తించిన విద్యావేత్త వెంకటేష్‌ను గ్రామస్తులు అభినందించారు. ప్రస్తుతం గుర్తించిన శిలా శాసనాన్ని ముత్యాలమ్మ ఆలయంలో పెట్టి గ్రామస్తులు పూజలు చేస్తున్నారు.
Also Read : RAPO23లోకి బాలీవుడ్ స్టార్.. కొత్త షెడ్యూల్ షురూ
Follow Us On: Youtube

