కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కరువు కాటకాలకు పర్యాయ పదంగా మారిన పాలమూరును సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రారంభించిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా డిండి ప్రాజెక్టును రూపొందించడం దుర్మార్గమని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ (Palamuru JAC) చైర్మన్ జి. రాజేందర్‌రెడ్డి, కో చైర్మన్ బెక్కెం జనార్ధన్‌లు ఆరోపించారు.
సోమవారం మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డిండి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, అవసరమైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికైనా వెనుకాడమని వారు హెచ్చరించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల నుండి వస్తున్న ఒత్తిడి మూలంగానే డిండి ప్రాజెక్టును పక్కకు పెట్టారని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తుందని అన్నారు.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మూలంగానే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నువ్వు కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ ప్రభుత్వం కూడా అవే తప్పులు చేస్తుందని వారన్నారు. నల్గొండ జిల్లా ప్రజలకు అన్యాయం జరగాలని పాలమూరు ప్రజలు కోరుకోవడం లేదని కాకపోతే 350 టీఎంసీల సామర్థ్యం గల నాగార్జునసాగర్ నుండి నీటిని ఎందుకు తీసుకోలేకపోతున్నారని వారు ప్రశ్నించారు.
పాలమూరు జిల్లా నేతల చేతగానితనం వల్లే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయని వారన్నారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇరు జిల్లాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొని ఉద్యమం తీవ్రతరం కాకుండా చేయాల్సింది పోయి, శ్రీశైలం ప్రాజెక్టు నుండి నల్లగొండకు నీళ్లు తరలిస్తామంటూ కొంతమంది నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు.
పాలమూరు బిడ్డనంటూ చెప్పుకునే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నలగొండ జిల్లా నేతల ఒత్తిడికి లొంగకుండా, పాలమూరు జిల్లాకు అన్యాయం చేయకుండా చేయాల్సిన గురుతర బాధ్యత ఉందని వారన్నారు. నల్గొండ జిల్లా ప్రజలకు నాగార్జునసాగర్ నీటితో గొట్టిముక్కుల రిజర్వాయర్ నింపి అక్కడి నుండి నల్గొండ జిల్లా ప్రజలకు సాగునీటిని, తాగునీటిని అందించేందుకు అవకాశాలు ఉన్నా పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు.
సోయిలేని నేతల వల్లే అన్యాయం
పాలమూరు జిల్లా ప్రతినిధులకు సోయి లేకపోవడం వల్లే డిండి ప్రాజెక్టు ద్వారా శ్రీశైలం జలాశయంలోని నీటిని తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. గత రెండు రోజుల క్రితం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీటి హక్కుల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి సవాల్ విసిరిన విషయం పాఠకులకు విధితమే. అధికారపక్షమైన ఎమ్మెల్యే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గళం విప్పారని, మిగతా పాలక, ప్రతిపక్ష నాయకులు కూడా తమ ఉద్యమానికి మద్దతు తెలిపి ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి డిండి ప్రాజెక్టు రద్దుకై కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు.
వామపక్షాల ద్వందనీతి
ప్రజా ఉద్యమాలలో ముందుంటామని చెప్పుకునే కమ్యూనిస్టు పార్టీలు డిండి ప్రాజెక్టు విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని పాలమూరు జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కమ్యూనిస్టు పార్టీలు ద్వంద్వ వైఖరి విడనాడి పాలమూరు జిల్లా ప్రయోజనాలు కాపాడే విధంగా తమతో కలిసి రావాలంటే పిలుపునిచ్చారు.
పండుగల సాయన్న స్ఫూర్తితో
తెలంగాణ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన పండుగల సాయన్న స్ఫూర్తితో ఈనెల 22న ఆయన జన్మదిన సందర్భంగా లక్ష మంది సంతకాలతో కూడిన విజ్ఞాపన పత్రాన్ని ప్రభుత్వానికి అందజేయనున్నట్లు బెక్కెం జనార్ధన్ తెలిపారు. పాలమూరు జిల్లా ప్రజలకు అన్యాయం చేసే విధంగా డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపడుతున్నారని, ఆ ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల మద్దతుతో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు చెన్నకిష్టయ్య, అనీఫ్ అహ్మద్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

