కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం లింగారం తండాలో (Lingaram Thanda) పండుగ వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి డిగ్రీ విద్యార్థి దుర్మరణం చెందాడు. తండాకు చెందిన బానోత్ అజయ్ (22) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పండుగ సెలవులకు స్వగ్రామానికి వచ్చిన అజయ్, తన వ్యవసాయ భూమిలో మోటార్ సరిగ్గా పనిచేస్తుందో లేదో పరిశీలించేందుకు సోమవారం బావి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మృతి చెందాడు.
ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అజయ్ తండ్రి బానోత్ వెంకన్న 15 నెలల క్రితం పురుగుమందు తాగి మృతి చెందగా, ఇప్పుడు కుమారుడు కూడా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తండ్రిని కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే, కుటుంబానికి ఆసరాగా ఉండాల్సిన కుమారుడు కూడా దూరమవ్వడంతో తల్లి వనిత, తమ్ముడు చంటి (16) రోదనలు అందరినీ కలచివేశాయి.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తాళ్ల సహాయంతో మృతదేహాన్ని బావి నుంచి వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండుగ రోజున తండాలో జరిగిన ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

