కలం, నల్లగొండ: కాంగ్రెస్ పార్టీకి ఆదివాసీలు ఎల్లవేళలా అండగా నిలిచారని, గ్రామస్థాయి నుంచి పార్టీకి అనుబంధంగా ఆదివాసీ కమిటీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆదివాసీ విభాగం చైర్మన్ కేతావత్ శంకర్ నాయక్ (MLC Shankar Naik) స్పష్టం చేశారు. నల్లగొండలోని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ‘సంఘటన్ సృజన్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి ఆదివాసీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
రాష్ట్రంలోని ఆదివాసీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీ విధివిధానాలపై చర్చించారు. నేతలను రాష్ట్రంలోని 33 జిల్లాలకు పంపించి, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమర్థులైన ప్రతినిధులతో నూతన కమిటీలను ఎంపిక చేస్తామని శంకర్ నాయక్ వెల్లడించారు. రానున్న హైదరాబాద్-రంగారెడ్డి, ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు సామ రామ్మోహన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డిల విజయం కోసం ఆదివాసీ విభాగాలు శక్తివంచన లేకుండా కృషి చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్పకాలంలోనే 75 వేల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు భరోసా కల్పించిందని శంకర్ నాయక్ కొనియాడారు. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని, తీవ్ర నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. మరోవైపు బీజేపీ పార్టీ మతాల పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ సంక్షేమ పథకాలతో ముందుకెళ్తుంటే ప్రతిపక్షాలు తప్పుడు ప్రాపగండాతో ప్రజలను దిశానిర్దేశం తప్పించే ప్రయత్నం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
గతంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ బడ్జెట్ అంచనా రూ.26 వేల కోట్లు ఉండగా, అది కాస్తా రూ.36 వేల కోట్లకు చేరిందని.. ఎంత ఖర్చు అయినా ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి తీరుతామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ నెల 23వ తేదీన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో ఆదివాసీ నాయకుల ప్రత్యేక సమావేశం ఉంటుందని, ఆ భేటీలో సీఎం పార్టీ బలోపేతానికి, ఆదివాసీల సంక్షేమానికి అవసరమైన దిశా నిర్దేశం చేస్తారని తెలిపారు. సమావేశంలో ఆదివాసీ విభాగం వైస్ చైర్మన్ లింగం నాయక్, నాయకులు హనుమంతు నాయక్, మోహన్, గణేష్, శ్రీనివాస్, చంద్రకళ, మల్లికార్జున్, మల్లీశ్వరి నాయక్, కోట్యా నాయక్, తిరుమల నాయక్ తదితరులు పాల్గొన్నారు.

